ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘నేను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం తీసుకున్నా. నా భార్య సవిత పేరిట సహకార బ్యాంకులో రూ.40 వేల అప్పు ఉంది. మాకు మేఘన, సమీరా కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు మేఘనకు 2019లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. 2002లో వివా హం చేసి భర్త ఇంటికి పంపాను. రేషన్‌కార్డులో కూతురు పేరును తీసేయించా. ప్రస్తు తం ఉన్న రేషన్ కార్డులో నా పేరుతోపాటు భార్య సవిత, చిన్నమ్మాయి సమీరా పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి న రుణమాఫీకి అన్ని విధాలుగా అర్హునిగా ఉన్న నాకు బ్యాంకు లోన్ మాఫీ కాలేదు.
అధికారులను అడిగితే మీ కూతురుకు ప్రభు త్వ ఉద్యోగం ఉన్నందు వల్లే రుణమాఫీ కాలేదని చెప్తున్నరు’ అని కౌఠకు చెందిన రైతు అల్లూరి రాంరెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఈ మేరకు అల్లూరి రాంరెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు లేఖ రాసి తనకు రుణమాఫీ జరిగేలా చూడాలంటూ వేడుకున్నాడు. ప్రస్తుత రేషన్‌కార్డులో వివా హం అయిన తన కూతురు పేరు లేకున్నా.. ఉందంటూ అధికారులు రుణమాఫీ చేయలేదని మంత్రికి విన్నవించాడు. తన వంటి సన్నకారు రైతులు రూ.2 లక్షల రుణమాఫీకి నోచుకోవడం లేదని లేఖలో వివరించాడు. రుణమాఫీపై బీఆర్ఎస్ పోరాటం చేయడం మంచి పరిణామమని పేర్కొన్నాడు. తన వంటి సన్నకారు రైతులకు అన్యాయం చేయడం సరికాదంటూ లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడు.