ఖైరతాబాద్, ఏప్రిల్ 18 : అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు. నిరుద్యోగ వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘తెలంగాణలో ఉద్యోగాలు-నిరుద్యోగ సమస్య’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ముక్తకంఠంతో ఖండించారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం ప్రస్తుత పాలకులదేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా 2లక్షల ఉద్యోగాలు భర్తీ కాలేదని, బ్యాక్లాగ్ పోస్టులు, నిరుద్యోగ భృతి, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు, మొదటి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీ అన్నారని.. కానీ అన్నీ మరచిపోయారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో 67వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారని, కానీ వాస్తవానికి 17వేల ఉద్యోగాలే భర్తీ చేశారని ఆరోపించారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు. నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసి, దీర్ఘకాలికంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేరళ మాడల్‌ను అనుసరించాలని టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ సూచించారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఈ పన్నెండేండ్ల కాలంలో ఏర్పడిన ఖాళీలతో ఆ సంఖ్య రెండు లక్షలకు చేరిందని పేర్కొన్నారు. రెండు లక్షల ఖాళీలతో పాలన ఎలా సమర్థవంతంగా నడుస్తుందని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్స్ మాత్రమే ప్రభుత్వాలను నడుపుతున్నందువల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పారు కానీ బయట మాత్రం అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు సంఘటితమై ప్రభుత్వంపై పోరాటాలు చేస్తేనే నోటిఫికేషన్లు సాధ్యమవుతాయని చెప్పారు.
రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం పక్కనపెట్టి కనీసం ఉన్న ఉద్యోగులకు జీతాల పెంచే పరిస్థితిలో లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులను మోసగించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లనే ఇప్పుడు కాంగ్రెస్ భర్తీ చేసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు రూ.9వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగ భృతి మరచిందని, గురుకులాలను పట్టించుకోవడం లేదని, మొత్తానికి ప్రభుత్వ విద్యనే గాలికి వదిలేసిందని మండిపడ్డారు.