హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తాము ప్రభుత్వాధినేతలమని విర్రవీగుతున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్లెం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీయే సుప్రీం అనే సందేశమివ్వాలని భావించిందా? సర్కార్‌లో ఎంత పెద్దస్థాయిలో ఉన్నా.. పార్టీకి మాత్రం కార్యకర్తే అనే సంకేతం ఇచ్చిందా? ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యమా? ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఢిల్లీకి పిలిపించి ఉద్దేశపూర్వకంగానే వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించిందా? తద్వారా ప్రభుత్వ పెద్దల అహంకారాన్ని తగ్గించి, వారిని అవమానించిందా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున జరుగుతున్న చర్చ ఇది. ఢిల్లీ వర్గాలు దీనికి అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వంలోని కీలక మంత్రులైనా సరే అందరికంటే పార్టీయే సుప్రీం. అంతేకాదు.. ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తం’ అని ప్రభుత్వాధినేతలకు కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కాగా, తెలంగాణ నేతల సమన్వయ సమావేశం పెట్టిన ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మాకొట్టారు. కానీ తర్వాత జరిగిన ఛత్తీస్‌గఢ్ నేతల మీటింగ్‌కు కేసీ మాత్రం హాజరయ్యారు. ఇది దేనికి సంకేతమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
రాష్ట్ర నేతలకు ఘోర అవమానం!!
బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ పాల్గొన్నారు. సమావేశానికి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. వారి స్థానంలో సీడబ్ల్యూసీ సభ్యుడు, రాష్ర్టానికి చెందిన జూనియర్ నేత వంశీచంద్‌రెడ్డిని పంపించారు. ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. హోదా ప్రకారం వంశీచంద్రెడ్డిదే పైచేయి అయినా, రాష్ర్టానికి చెందిన కీలక నేతల సమావేశానికి అధ్యక్షత వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య ద్వారా రాష్ట్ర కీలక నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా అవమానించిందని, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి తాకట్టు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కావాలనే ‘పెద్దల’ డుమ్మా !
రాష్ట్ర ముఖ్యనేతను, ఇతర కీలక నేతలను తక్కువ చేసే ఉద్దేశంతోనే హైకమాండ్ ఇలాంటి ఎత్తుగడ వేసిందనే చర్చ జరుగుతున్నది. ఖర్గే, కేసీ కావాలనే డుమ్మా కొట్టారని చెప్పుకొంటున్నారు. రాష్ట్ర నేతలకు కీలక సంకేతాలు పంపించాలనే ముందస్తు ప్రణాళికలో భాగంగానే అధిష్ఠానం పెద్దలు వారిద్దని సమావేశానికి వెళ్లొద్దని చెప్పినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్లే హాజరుకాలేకపోయారని వారిద్దరూ చెప్పినట్టు సమాచారం. కేసీ ఢిల్లీలోనే జరిగిన ఛత్తీస్‌గఢ్ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర నేతలకు, వేణుగోపాల్‌కు మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర నేతలపై కేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వంతో ఎంత పెద్ద వారైనా పార్టీలో కిందివారే అనే సంకేతాలు ఇచ్చేందుకే వంశీచంద్‌రెడ్డిని కీలక స్థానంలో కూర్చోబెట్టి సమావేశం నిర్వహించారని తెలుస్తున్నది.