హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): ‘నాకు రెన్యువల్ ఖాయమైంది. మళ్లీ నేనే వస్తా. పదవీకాలం పూర్తయిందని తోక జాడిస్తే వచ్చాక లెక్కలు తేలుస్తా.. సంగతి చూస్తా’ అంటూ తాజా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రెచ్చిపోతున్నారు. పదవీకాలం పూర్తయినా ఇంకా కుర్చీలను మాత్రం వదలడం లేదు. మళ్లీ చైర్మన్ అయ్యేది తామేననేంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పదవి లేకపోయినా అధికారిక కార్లలో చక్కర్లు కొడుతూ పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. ఆయా కార్పొరేషన్లలో పనుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న అధికారులు, ఉద్యోగులను బెదిరిస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వారికి మళ్లీ చైర్మన్‌గిరీ అప్పగిస్తే అవినీతి, అక్రమాలతో అంతా సర్వనాశనమే అంటూ అధికారులు ఉసూరుమంటున్నారు.
మళ్లీ పదవి నాకే!
రాష్ట్రంలో సుమారు 37మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ఇటీవల ముగిసింది. అప్పటినుంచి తాజా మాజీ చైర్మన్లంతా మరోసారి చైర్మన్‌గిరీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మం చేశారు. ఇందులో కొంతమంది తమకు చైర్మన్ పదవి ఖాయమైందని, అధిష్ఠానం నుంచి కూడా హామీ దక్కిందని ప్రచారం చేసుకొంటున్నారు. కొందరు సీఎం రేవంత్‌రెడ్డి పేరు, మరికొందరు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు చెబుతున్నారు. ఇందులో కొందరు తమ పాత పోస్ట్ కాకుండా కొత్త కార్పొరేషన్ కోసం ఆసక్తి చూపితే.. ఇంకొందరు మాత్రం మొన్నటిదాకా పదవి అనుభవించిన కార్పొరేషన్ పదవే కావాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. అందుకే సదరు కార్పొరేషన్ల అధికారులు, ఉద్యోగుల వద్ద మళ్లీ చైర్మన్‌గా తానే వస్తున్నానంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.
కార్లు తిరిగివ్వలేదు.. పాలనలో జోక్యం మానలేదు
ఇటీవల ఓ మంత్రి తన శాఖ పరిధిలోని ఓ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ తాజా మాజీ చైర్మన్ నేమ్ బోర్డును చూసి అవాక్కయ్యారు. ‘ఇంకా ఆ బోర్డు ఎందుకు ఉంచారు. వెంటనే ఆ బోర్డును తొలగించండి’ అంటూ అధికారులను ఆదేశించారు. చాలా కార్యాలయాల్లో ఇలాగే ఉన్నట్టు తెలిసింది. అధికారిక వాహనాలు వినియోగించడం, రెగ్యులర్‌గా ఆఫీసులకు రావడం, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అనధికారికంగా అధికారులతో రివ్యూలు చేస్తున్నట్టు తెలిసింది. వాహనాలు తిరిగివ్వాలని అడిగితే.. ‘ఎలాగూ వచ్చేది నేనే కదా.. ఉండనివ్వండి పోయేదేముంది’ అంటూ బదులిస్తున్నట్టు సమాచారం. అధికారులను పిలిపించుకొని బిల్లుల చెల్లింపుల్లో జోక్యం చేసుకుంటున్నట్టు తెలిసింది.
అవినీతి మచ్చ ఉన్న వారికి ఇవ్వొద్దు?
ఇప్పటికే పలువురు చైర్మన్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు మాజీలపై ఆయా శాఖల మంత్రులకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో వారిపై అంతర్గత విచారణ కూడా చేయించి పక్కన పెట్టారు. అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇవ్వొద్దనే సంకేతాలు సైతం అధిష్ఠానానికి పంపినట్టు తెలిసింది. ఇలాంటి తాజా మాజీలకు మరోసారి చైర్మన్ పదవి ఇస్తే అవినీతి, అక్రమాలను ఆపడం ఎవరితరం కాదని అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఆయా కార్పొరేషన్లలో అవినీతికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని, ఇక పదవి రావడమే ఆలస్యంగా పనులు మొదలుపెడుతారని చెబుతున్నారు. వారికి మళ్లీ అవకాశం ఇవ్వకపోవడమే మంచిదని తెగేసి చెబుతున్నారు.