పేదలపై భారం వేసే ఏ ఒక్క ప్రతిపాదననూ తెలంగాణ ఒప్పుకొనే ప్రసక్తే లేదు. ట్రూఅప్ చార్జీల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. ట్రూఅప్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ సిఫారసు చేసినప్పటికీ దానిని పక్కనబెట్టి రూ.12 వేల కోట్ల అదనపు భారాన్ని భరించి సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
-మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, మార్చి 26 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగం అధికంగా ఉండే సమయం (పీక్ టైమ్)లో చార్జీలను 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ముమ్మాటికీ ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రతిపాదనను బట్టి చూస్తే.. ప్రధాని మోదీ పాలకుడిలా కాకుండా వ్యాపారిలా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతున్నదని దుయ్యబట్టారు. ఇది సామాన్యుడిని విద్యుత్తు వినియోగానికి దూరం చేయడమేనని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలపై భారం వేసే ఏ ఒక్క ప్రతిపాదననూ ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
ట్రూ అప్ చార్జీల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ట్రూ అప్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ సిఫారసు చేసినప్పటికీ దానిని పక్కనబెట్టి రూ.12 వేల కోట్ల అదనపు భారాన్ని భరించి సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. విద్యుత్తు వినియోగం అధికంగా ఉండే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, ఉదయం 5 నుంచి 10 గంటల వరకు విద్యుత్తును వినియోగించే వారిపై భారం మోపాలని కేంద్రం ప్రతిపాదించిందని, దానిని ఒప్పుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. పీక్ డిమాండ్‌లో 20% చార్జీలు పెంచడమంటే గృహ వినియోగదారులతోపాటు పారిశ్రామికవేత్తలపై అధిక భారం మోపినట్టు అవుతుందని చెప్పారు.
అధికారంలోకి వస్తే.. దేశంలో విద్యుత్తు కాంతులు ప్రసరింపజేస్తామంటూ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన బీజేపీ.. తీరా అధికారంలోకి వచ్చాక విద్యు త్తు వినియోగం నుంచి సామాన్యుడిని దూ రం చేసే కుట్రలకు తెర లేపిందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. వ్యాపారుల కోసమే తమ ప్రభుత్వం ఉన్నదని ప్రధాని మోదీ నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీలను ఎత్తివేసే చర్యలకు బీజేపీ ప్రభుత్వం రూట్‌మ్యాప్ సిద్ధంచేసిందని విమర్శించారు.
తెలంగాణలోని ప్రతి కనెక్షన్‌కూ మీటర్ పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫారసులను తోసిపుచ్చినందుకే రాష్ట్ర ప్రభుత్వంపై పర్ఫార్మెన్స్ పేరుతో రావాల్సిన అప్పులను అడ్డుకుంటున్నదని, ఎఫ్ఆర్బీఎం పరిమితుల పేరుతో మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదల పక్షంగానే ఉంటుందని చెప్పారు. పీక్ డిమాండ్ సమయంలో 20 శాతం చార్జీలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫారసుపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. జేబులకు చిల్లులు పెట్టడం, ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని ఎద్దేవా చేశారు.