Leopard | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి గ్రామ శివార్లలో చిరుత పులి సంచరించిందని పేర్కొన్నారు. దీంతో రైతులు వ్యవసాయ పొలాల నుంచి ఇంటికి రావడం, ఇంటి నుంచి పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల కాపరులు కూడా భయపడుతున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి పులిని బంధించాలని, గ్రామస్తులకు నష్టం జరగుకుండా చూడాలని కోరారు.
అటవీశాఖ అధికారులు తలమల గ్రామ శివార్లకు చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తలమల, పెద్దంపేట అడవుల మధ్య చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి మంచిర్యాల జిల్లాలోని అడవుల్లోకి చిరుత ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు.