మిర్యాలగూడ, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం రోజుకు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, ఈ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని, నల్లగొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన సభలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొనడం దీనికి నిదర్శనమని చెప్పారు. భట్టి పబ్లిసిటీ కోసం తనపైనా, మంత్రి జగదీశ్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటిని అందించేందుకు త్వరలోనే డిండి ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తికావొచ్చిందని, ఇంకా 9 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కండ్లు ఉన్న కబోది అని ఎద్దేవా చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఆయనకు ఏం కనపడటం లేదని విమర్శించారు.
నల్లగొండ ఎంపీగా నాలుగేండ్లలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రం నుంచి ఏం సాధించారో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కులు ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేయలేదని, వారందరూ తెలంగాణ ద్రోహులేనని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఏం చేసిందో ప్రజలను అడిగితే వారే సమాధానం చెప్తారని పేర్కొన్నారు. గత తొమ్మిదేండ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. కేవలం కాల్వలు తవ్వి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. తమకు కేసీఆర్ ఒక్కడే నా యకుడని, ఒక్కటే ఎజెండా అని, కాంగ్రెస్, బీజేపీలకు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అసమర్ధులు కాబట్టే ఢిల్లీ వైపు చూస్తున్నారని, కేసీఆర్ సమర్ధుడు కాబట్టే ఢిల్లీనే ఆయ న వైపు చూస్తున్నదని అన్నారు. బీజేపీ నేత విద్యాసాగర్‌రావు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అని వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. రెండో రాజధానిని ఉత్తర భారతదేశంలో పెట్టుకోవాలని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పెత్తనం తమకు అక్కర్లేదని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతారని, ఆయన స్థిమితం లేని నాయకుడని ఎద్దే వా చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భా ర్గవ్, రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.