నాగార్జునసాగర్, అక్టోబర్, 14 : సమాజం రుగ్మతలకు బుద్ధుని బోధనలు(,Buddhism) ఒకటే శరణ్యమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. బుద్ధ వనంలో ధమ్మ విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం నాగార్జునసాగర్‌లో(Nagarjunasagar) రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనంలో సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధమ్మాని స్వీకరించిన రోజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు అయిన అక్టోబర్ 14 సోమవారం నాడు నిర్వహించిన ధమ్మ విజయం వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వార్థం మితిమీరిన ప్రస్తుత సమాజంలో బుద్ధుని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే లేదన్నారు. అనంతరం శాసనమండలి సభ్యుడు మంకెన కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో విలసిల్లిన బౌద్ధాన్ని ప్రస్తావిస్తూ బుద్ధ వనం రాబోయే రోజులలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని హంగులతో సిద్ధమైన బుద్ధవనం రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లతా రాజా ఫౌండేషన్ సలహాదారు పిఎస్ఎన్ మూర్తి, బుద్ధ వనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి, బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్య ప్రకాష్ రావు, శ్యామ్ సుందర్ రావు, తదితరులు పాల్గొన్నారు