హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తనపై, తన కుటుంబంపై నిరాధార, పరువునష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడటం దురదృష్టకరమని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లో స్పందించాలని, లేదంటే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, దురుద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. కానీ, ఆయన మరోసారి చట్ట వ్యతిరేకంగా నోరుపారేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ తన న్యాయవాదులతో బండి సంజయ్, అర్వింద్‌కు నోటీసులు పంపించారు. సంజయ్‌కు పంపించిన నోటీసుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను న్యాయవాదులు ప్రస్తావించారు.
కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ చేసి వేలకోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ గత జనవరి 23న నిర్వహించిన ప్రెస్మీట్లో సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే సంజయ్‌పై సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని ఆక్షేపించారు.
కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యక్తిగత దూషణలు దుర్మార్గమని లీగల్ నోటీస్‌లో పేర్కొన్నారు. అర్వింద్ ఆధారరహితంగా వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ ఇతోధికంగా కృషి చేశారని, ఐటీ రంగ విస్తరణకు నిర్విరామంగా శ్రమించారని తెలిపారు.
అలాంటి వ్యక్తిపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కితీసుకోవాలని, కేటీఆర్‌కు బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.