హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, పార్టీ మారాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదని చెప్పారు. గెలిచినప్పుడు పొంగిపోవడం.. ఓడినప్పుడు కుంగిపోవడం రాజకీయ నాయకుల లక్షణం కాదని పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎల్పీ కార్యాలయంలో సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమని, ఇందులో రాజకీయ పార్టీలు గెలిచినా.. ఓడినా అవి నిరంతరం ప్రజల పక్షానే నిలబడతాయని తెలిపారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పారు. తాము బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. గెలిచిన ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నిర్మాణాత్మక సూచనలు తప్పకుం డా చేస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌పార్టీ నిలబెట్టుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వానికి కనీసం నాలుగైదు నెలల సమయం ఇచ్చి వేచి చూశాక.. హామీలు అమలు చేయకపోతే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు శత్రువులు కాదని తెలిపారు.