Tragedy | తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు.. శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన ఈ దంపతులు జనవరి 8వ తేదీన ఓ ప్రైవేటు సర్వీస్‌లో శబరిమల దర్శనానికి వెళ్లారు. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో కన్యాకుమారి సమీపంలో బైపాస్ రోడ్డులో బస్సును ఆపారు. అక్కడ సముద్ర స్నానం చేసుకుని దేవాలయాలు సందర్శించుకుని బస్సు దగ్గరకు వస్తుండగా వారికి ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కన్యాకుమారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.