Belt Shops | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పల్లెలు, పట్టణాల్లోని ఏ గల్లీ చూసినా, ఏ వాడకు వెళ్లినా బెల్ట్‌షాపుల జాడలు కనిపిస్తున్నాయి. ఊళ్లల్లో ఏ బస్టాండ్ పక్కన చూసినా, ఏ వాడలోని కిరాణా దుకాణంలోకి తొంగిచూసినా మద్యం అక్రమ అమ్మకాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బెల్ట్ షాపుల తాట తీయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పుడు రాష్ట్రమంతా లక్షకు పైగా బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అయినా పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. కాంగ్రెస్ అభయహస్తం హామీల్లో 401వ హామీ అయిన ‘బెల్ట్‌షాపులు పూర్తిగా రద్దు’ హామీ అటకెక్కింది. రాష్ట్రంలో 12 వేలకు పైగా ఉన్న పంచాయతీలుంటే 1,000 మందికి పైగా జనభా కలిగిన ప్రతీ పంచాయతీలోనూ కనీసం 7 నుంచి 10 వరకు బెల్ట్‌షాపులు దర్శనమిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లోని గల్లీల్లో ‘మందుకొట్లు’ దర్శనమిస్తున్నాయని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. నిరుడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి, కోసాయి గ్రామాల్లో బెల్ట్‌షాపులపై మహిళలు దాడులు చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారంటూ మహిళలు రగిలిపోతున్నారు.
బెల్ట్‌షాపుల పనిపడతామని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఆ అంశంపై ఒక్కసారి కూడా సమీక్షే చేయలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2023 డిసెంబర్లో ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన తొలి సమావేశంలోనే బెల్ట్‌షాపుల ప్రాధాన్యం తెలుసుకున్న సీఎం.. ఏడాది పూర్తయినా వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. గత బడ్జెట్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం అదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం ప్రకారమే.. బెల్ట్‌షాపులపై ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదని వారు తేల్చిచెప్తున్నారు.
తేదీ : 22 ఫిబ్రవరి 2023.
వేదిక : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో
పాదయాత్ర కార్నర్ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3,000 వైన్‌షాపులు, 60 వేల బెల్ట్‌షాపులున్నాయి. మహిళలు తీవ్రంగా బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉంటే బట్టలూడదీసి కొట్టి, బొకలో వేయిస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
తేదీ : 17 నవంబర్ 2023
వేదిక : హైదరాబాద్ గాంధీభవన్
అభయహస్తం పేరుతో కాంగ్రెస్ రూపొందించిన 42 పేజీల మ్యానిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేశారు. అందులో 62 ప్రధాన అంశాలను ప్రస్తావించింది. వాటిల్లో 100 రోజుల్లో చర్యలు తీసుకుంటామన్న హామీల్లో బెల్ట్‌షాపుల రద్దు ఒకటి.
రాష్ట్రంలో బెల్ట్‌షాపుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఏ పండగొచ్చినా, ఎలాంటి శుభకార్యాలు జరిగినా బెల్ట్షాపులదే హవా. సాయంత్రమైతే చాలు ఏ కిరాణా కొట్టు వద్ద చూసినా, బస్టాండ్ల సమీపంలోని కిల్లీ కొట్లుచూసినా నిత్యం 10 మంది మద్యం కోసం తచ్చాడుతూ ఉంటారు. గత డిసెంబర్ నెలాఖరున మునుపెన్నడూ లేనంతగా రూ.200 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని సాక్షాత్తూ ఎక్సైజ్ అధికారులే చెప్పారు. ఇదంతా బెల్ట్‌షాపుల మహత్యమేనని అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా యువత తమ ఊరిలో బెల్ట్‌షాపులను నిర్మూలించాలని కోరితే.. కొందరు ఎక్సైజ్ అధికారులు.. తమ డిక్షనరీలో బెల్ట్‌షాపు అనే పదమే లేదని బుకాయిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎక్సైజ్ వార్షిక నివేదికలో మాత్రం 6,900 మంది బెల్ట్‌షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని చెప్పినా, తూతూ మంత్రంగానేనని తేలిపోయింది. బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పరోక్షంగా చెప్పారు.