వరంగల్ లీగల్, మే 31: ప్రపంచం మెచ్చిన కాకతీయ కళాతోరణం గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్‌బాబు హెచ్చరించారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను తొలగించడాన్ని ఓరుగల్లు బిడ్డలుగా జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు. ఒకవేళ నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే మరోసారి న్యాయవాదులందరమూ ఒకగొంతుతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
శుక్రవారం వరంగల్ కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, మహేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల మేధావులు, రాజకీయ నాయకులను సంప్రదించిన తర్వాతే రాజముద్రను ఆమోదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్యామ్‌సుందర్‌రావు, సంసాని సునీల్, అబ్దుల్నబీ, శివరాజు, వసంత్యాదవ్, మహేశ్‌పటేల్, కిరణ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.