లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, విభజన హామీలను కేంద్రం విస్మరించకుండా చట్టాన్ని సవరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై బడ్జెట్లో కేంద్రం మాట మాత్రం అయినా ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉన్నదని తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీలుగా తాము అనేక సందర్భాల్లో కేంద్రం దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదని, ఈ నేపథ్యంలోనే విభజన చట్టాన్ని కేంద్రం విస్మరించకుండా సవరణ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూమి ఇవ్వటానికి ముందుకొచ్చినా కేంద్రం బడ్జెట్లో దాని ప్రస్తావనే తేలేదని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్లలో ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిచేయాలని విభజన చట్టమే చెప్పిందని, ఏడున్నరేండ్లు గడిచినా బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు.
నగరాల్లోనూ నరేగా తేవాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా నగరాలు, పట్టణాల్లోని పేదల ఉపాధి కల్పనకూ చట్టం తేవాలని ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని పట్టుబట్టారు. ఉపాధి, మెరుగైన జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, ఈ నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైనా దృష్టి సారించాలని తెలిపారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో పట్టణ జనాభా 2030 నాటికి 50 శాతం దాటే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్టు వెల్లడించారు.