Telangana | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు గడిచిన 24గంటల్లోనే అనేక నేరాలు, ఘోరాలు చోటుచేసుకోవడం శాంతిభద్రతల దుస్థితికి అద్దంపడుతున్నది. భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పట్టపగలు ఓ వ్యక్తిని ఐదారుగురు కలిసి కర్రలతో కొట్టి చంపడం కలకలం సృష్టించింది. తనకు ప్రాణహాని ఉందని పది రోజుల ముందే చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఈ దారుణాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. చూసిన నెటిజన్లంతా ‘తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉన్నదా? లేదా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. పౌరసమాజం ప్రశ్నించడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఊట్కూర్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేశారు. పాతకక్షల కారణంగా హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపడం, నగరంలోనే మరోచోట ఫైనాన్స్ వ్యవహారంలో ఇంట్లోకి చొరబడి ఓ వివాహిత గొంతుకోసి చంపడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు లైంగికదాడి చేసి చంపడం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతిలో పడేసింది.
ప్రాణం తీసిన భూతగాదా
భూతగాదాకు ఒకరు బలయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఎర్రగండ్ల సంజప్ప, రెండో భార్యకు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప సంతానం. అతడి పేరిట ఉన్న 9 ఎకరాలను ముగ్గురు కొడుకులకు సమానంగా బదలాయించాడు. తర్వాత కొన్నేండ్లకు లక్ష్మప్ప మృతి చెందగా.. అతడి కుమారులు భూపంపకాలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. కొన్నేండ్లుగా వీరి మధ్య వివాదం సాగుతున్నది. కాగా గురువారం పెద ్దసవారప్ప, అతడి కుమారుడు సంజీవ్(28), సోదరుడు చిన్న సవారప్ప, మరదలు కవిత వారి పేరుపై ఉన్న పొలంలో విత్తనాలు విత్తేందుకు వెళ్లారు.
వీరిపై దాయాదులు ఆశప్ప, గుట్టప్ప, చిన్న వెంకటప్ప, ఆటో సంజీవ్, శ్రీను, కిష్టప్ప, నట్టలప్పతోపాటు మరికొందరు రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, పిల్లలు సాత్విక్, వంశీ ఉన్నారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా.. మక్తల్ సీఐ చంద్రశేఖర్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దాయాదుల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయాన్ని బాధిత కుటుంబం, స్థానికులు డయల్ 100కు సమాచారం అందించినా ఎస్సై ఆలస్యంగా స్పందించారని తెలిసింది. బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న సంజీవ్.. తమకు దాయాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని పది రోజుల కిందటే పోలీసులను ఆశ్రయించాడు. అయితే దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆరేండ్ల బాలికపై లైంగికదాడి.. హత్య
ఓ దుర్గార్ముడి కామదాహానికి అభంశుభం తెలియని ఆరేండ్ల బాలిక అసువులుబాసింది. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడిచేసి హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాంకు చెందిన దంపతులు నెల క్రితం బతుకుదెరువు కోసం ఇద్దరు బిడ్డలతో కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వచ్చి రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి వీరు నిద్రిస్తుండగా పక్క రైస్‌మిల్లులో పనిచేసే బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన వినోద్ (రాజ్‌కుమార్) రాత్రి 11 గంటల తర్వాత కూతురు(6)ను ఎత్తుకుపోయి, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసి హతమార్చాడు. అర్ధరాత్రి తల్లికి మెలకువ వచ్చి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. తోటి కార్మికులతో కలిసి గాలించగా, చెట్ల పొదల్లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. రైస్‌మిల్లులోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, నిందితుడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారు జామున పెద్దపల్లి డీసీపీ చైతన్య, ఏసీపీ కృష్ణ, పెద్దపల్లి సీఐ సుబ్బారెడ్డి, సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కో సం సుల్తానాబాద్ దవాఖానకు తరలించారు. బిడ్డపై ఇంతటి ఘోరం జరగడంతో తల్లిదండ్రు లు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిందితు డిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.
దహెగాంలో విషాదం
బాలిక మరణంతో దహెగాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి అన్యా యం మరేబిడ్డకు జరగవద్దని, దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఆరెకుల సంక్షేమ సంఘం నాయకులు దహెగాం తహసీల్దార్, ఎస్ఐని కలిసి నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని , మిల్లు యాజమానులపైనా చట్టపరంగా చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఆత్మకు శాంతి కలగాలని మండలకేంద్రంలో యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ‘కామాంధుడికి ఉరే సరి’అని నినాదాలతో హోరెత్తించారు. అంగడిబజార్‌లో చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించారు.
కామాంధుడిని శిక్షించాలని రాస్తారోకో
చిన్నారిని పొట్టనబెట్టుకున్న కామాంధుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువులు సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. వీరికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
పాత కక్షలతో పొడిచి చంపేశారు
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలోనే యువకుడిని హత్య చేసినట్టు ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిరుడు ఆగస్టు 27న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముజాహిద్‌ను, అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖుద్దూస్(27) మరికొందరితో కలిసి హత్య చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ముజాహిద్ సోదరులు గురువారం అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్ క్రాస్‌రోడ్ సమీపంలో ఖుద్దూస్ వెంటపడి వేటాడారు. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ఖుద్దూస్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నిందితులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన ఖుద్దూస్‌ను ఉస్మానియా దవాఖానకు చికిత్సకోసం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఖుద్దూస్ మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత గొంతుకోసి దారుణ హత్య
వివాహిత గొంతు కోసి దారుణంగా హతమార్చిన సం ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకొన్నది. సీఐ పాలవెల్లి తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక సే డం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి (32) తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వ చ్చి.. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ -1లో నివాసముంటున్నది. స్థానిక అపర్ణ టవర్స్‌లో వంట మనిషిగా పని చేస్తున్నది. విజయలక్ష్మీ సోదరుడు సునీల్.. ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ దగ్గరి నుంచి ఫైనాన్స్ కింద కొంత నగదు తీసుకొన్నాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగి పోలీ సు కేసు వరకు వెళ్ళగా, ఇటీవలే లోక్ అదాలత్‌లో కేసును ఉపసంహరించుకొన్నట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం విజయలక్ష్మి ఇంట్లోకి శ్రీనివాస్‌గౌడ్ చొరబడి కత్తితో ఆమెను గొంతును గాయపరిచి, దారుణహత్య చేశాడు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలా… వివాహిత సంబంధంతో హత్యకు దారితీసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా హంతకుడు శ్రీనివాస్‌గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
న్యాయవాదిని బెదిరించిన ఎస్సై
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో సివిల్ పంచాయితీలో తలదూర్చినందుకు పోలీసులను న్యాయవాది సురేశ్‌గౌడ్ ప్రశ్నించారు. దీంతో స్థానిక ఎస్సై విజయ్ భాస్కర్ ఏకంగా అడ్వకేట్ అని కూడా చూడకుండా బెదిరించి, దుర్భాషలాడారు. దీన్ని నిరసిస్తూ గద్వాల జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ మేరకు జడ్జీలకు, డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.