హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్‌లో రాజకీయకోణం ఉందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ను ఓ కేసులో ఇరికించాలని కొందరు చూశారా? అతని పేరు చెప్పించే క్రమంలో థర్డ్ డిగ్రీకి పాల్పడటం వల్లే రాజేశ్ చనిపోయాడా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు వెలికితీయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజేశ్ తల్లి లలిత, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని కోరారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగం, చిలుకూరు ఎస్సై సురేశ్‌రెడ్డిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోని డీఎస్పీ, ఎస్పీపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం స్వీకరించిన తర్వాత త్వరలోనే విచారణ చేపట్టి, న్యాయం జరిగేలా చూస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
ఇది.. దేశంలోనే అరుదైన లాకప్‌డెత్!
డీజీపీని కలిసిన తర్వాత మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కోదాడలో దళిత వర్గానికి చెందిన చెందిన రాజేశ్‌పై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా పోలీసులు కస్టడీకి తీసుకొని తీవ్రమైన చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారకులయ్యారని మండిపడ్డారు. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్సై, పోలీస్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది దేశంలోనే అరుదైన కస్టోడియల్ డెత్ అని చెప్పారు. ఇప్పటివరకు ఫిర్యాదులు తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్న సందర్భంలో హింసల వల్ల లాకప్‌డెత్‌లు జరిగాయని తెలిపారు. కానీ ఫిర్యాదు, కేసు లేకపోయినా యువకుడిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి, అతడి చావుకు కారణమైన అరుదైన ఘటన ఇది అని చెప్పారు. నవంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు రాజేశ్‌ను పోలీసులు కస్టడీలో పెట్టుకొని, చిత్రవధ చేశారని, ఆ విషయం కోర్టుకు తెలియకుండా పోలీసులే ప్రమాదకరమైన నొప్పి నివారణ ఇంజెక్షన్లు ఇప్పించారని, అందువల్లనే రాజేశ్ చనిపోయాడని తెలిపారు.
నా బిడ్డ భోజనం ఎవరికి పెట్టారు?
‘ఏయ్.. నువ్ అడ్డుపడకమ్మా.. నీ కొడుకును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. మళ్లీ వెంటనే తీసుకొస్తాం’ అని నవంబర్ 4న తన కుమారుడు రాజేశ్‌ను కానిస్టేబుల్ రామారావు, హోంగార్డ్ నరసింహారావు ఇంట్లో నుంచి తీసుకెళ్లారని రాజేశ్ తల్లి లలిత డీజీపీకి తెలిపారు. కానీ నవంబర్ 9న అరెస్ట్ చేసినట్టుగా అబద్ధం చెప్తున్నారని తెలిపారు. నవంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు 5రోజులపాటు కోదాడ రూరల్, చిలుకూరు పోలీస్స్టేషన్ల వద్ద ఉన్న తన కుమారుడి కోసం భోజనం తీసుకెళ్లానని తెలిపారు. ఆ భోజనాన్ని పోలీసులు లోపలికి తీసుకెళ్లి లాకప్‌లో ఉన్న రాజేశ్‌కు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాజేశ్‌ను చూపించాలని కోరితే పోలీసులు నిరాకరించింది నిజం కాదా అని నిలదీశారు. తాను ఒత్తిడి చేస్తే.. లాకప్‌లో ఉన్న తన బిడ్డను 8న పోలీసులు చూపించారని.. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చిత్రహింసలు పెట్టారని డీజీపీ ఎదుట ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డను కొట్టి చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. తన కుమారుడు స్టేషన్లో లేకపోతే… తాను పట్టుకెళ్లిన భోజనం తీసుకెళ్లి.. పోలీసులు ఎవరికి పెట్టారని ప్రశ్నించారు.
మర్డర్ కేసు పెట్టాలి.. రీపోస్టుమార్టం చేయాలి
రాజేశ్‌ను తీవ్రమైన చిత్ర హింసలు పెట్టారని చెప్పడానికి తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని మంద కృష్ణమాదిగ డీజీపీకి తెలిపారు. రాజేశ్ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు పోలీసులు ‘హైకార్డ్’ అనే ఇంజెక్షన్ తెప్పించి రాజేశ్ కుడి చేతి నరానికి ఇప్పించారని ఆధారాలు చూపించారు. పోలీసులు డాక్టర్ల సూచన లేకుండా రాజేశ్‌కు ఇంజెక్షన్ వేయించి కోర్టుకు హాజరు పరిచారని తెలిపారు. సిరంజీ, ఇంజెక్షన్ బాటిల్‌తోపాటు ఇతర ఆధారాలను సేకరించినట్టు చెప్పారు. కర్ల రాజేశ్ మృతి ఘటనలో కోదాడ రూరల్, చిలుకూరు పోలీసు స్టేషన్లు, కోర్టు ప్రాంగణం, వివిధ ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుడు, నిందితులు, పోలీసుల కాల్‌డేటా, లొకేషన్ వివరాలు వెల్లడించాలని, తెరవెనుక రాజకీయశక్తులను బయటకు లాగాలని డిమాండ్ చేశారు. ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా.. పోలీసులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌మాదిగ, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజుమాదిగ, హైకోర్టు అడ్వకేట్ అంబేదర్, కర్ల రాజేశ్ తమ్ముడు కమల్ తదితరులు పాల్గొన్నారు.