Medigadda Project | హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ బలవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ కుటిల పన్నాగాలతో ప్రాజెక్టు పడావు పడుతున్నదని ప్రతిపక్షపార్టీల నేతలు, రైతులు మండిపడుతున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగుబాటు ఘటనను కాంగ్రెస్ మొదటి నుంచి రాజకీయాలకే వాడుకుంటున్నదని, విచారణలు, కమిషన్ల పేరిట బద్నాం చేయడమే తప్ప పునరుద్ధరణ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నీళ్లు ఇవ్వాలనే సోయి లేకుండా సర్కారు పెద్దలు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక వచ్చిన అనంతరమే పునరుద్ధరిస్తామంటూ సాకులు చెప్పిన సర్కారు, ఇప్పుడు రిపోర్టు వచ్చి 20రోజులైనా ఆ ఊసే ఎత్తకపోవడం నిదర్శనంగా నిలుస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం తీరుతో వచ్చే సీజన్లోనూ నీటి ఎత్తిపోతలు లేనట్టేనని ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆది నుంచీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు, రైతులు, రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి అనేక అసంబద్ధ అంశాలతో విషప్రచారం చేస్తూ వచ్చాయని గుర్తుచేస్తున్నారు. ఇక 2023అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోయిన ఘటనను అదునుగా తీసుకుని, ప్రాజెక్టుపై మరింతగా దుష్ప్రచారం మొదలుపెట్టాయ ని చెప్తున్నారు. ఆ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు కేంద్రానికి లేఖ రాయడం, హుటాహుటినా ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగడం, ఎలాంటి పరిశీలనలు చేయకుండానే నివేదిక పేరిట కాంగ్రెస్, బీజేపీ హడావుడి చేశాయని ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ నేతలు అలాంటి రాజకీయాలకు పూనుకున్నారని, ప్రాజెక్టు సందర్శన పేరిట హడావుడి చేశారని విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించిందని ప్రతిపక్షాల నేతలు గుర్తుచేస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసిందని, విచారణ అంశాలను అనుకూల మీడియా సంస్థలకు లీకులు ఇస్తూ ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలకు తెరలేపిందని చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత ఏదైనా అంశంలో డిఫెన్స్‌లో పడిపోయిన ప్రతీ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకు తీసుకురావడం పరిపాటిగా మారిపోయిందని మండిపడుతున్నారు. తుది నివేదిక ఏడాదిన్నరపాటు కాలయాపన చేసిన ఎన్డీఎస్ బీఆర్ఎస్ రజతోత్సవానికి రెండు రోజుల ముందే రిపోర్ట్ ఇవ్వడం, అది ఇరిగేషన్‌శాఖకు చేరకముందే బయటకు లీక్ కా వడం కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు కుట్రలకు అద్దం పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను సమర్పించి 20రోజులు గడిచినా కాంగ్రెస్ పెద్దలు దాని ఊసే ఎందుకు ఎత్తడంలేదని ప్రశ్నిస్తున్నారు.
నివేదిక సమర్పించేందుకు కాళేశ్వరం కమిషన్ సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని విధంగా కాంగ్రెస్ సర్కారు కమిషన్ గడువును జూలై31 వరకు గడువును పెంచింది. విజిలెన్స్ నివేదికను, ఎన్డీఎస్ఏ నివేదికను సైతం కమిషన్ అధ్యయనం చేసిన కమిషన్ సొంతంగా సేకరించిన సమచారంతోపాటు, ఆయా నివేదికల్లోని అంశాలన్నింటినీ క్రోడీకరించి దా దాపు 400పేజీలతో రిపోర్టును సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. మరో రెండురోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కమిషన్ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. కానీ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండునెలలు పొడిగించడం వెనుక ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చని అని బీఆర్ఎస్ నేతలు, నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు.