హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను మూడు చెక్‌పోస్టుల వద్ద సేకరిస్తున్నారు. ఉమామహేశ్వరం చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలు తక్కువ. మన్ననూర్, దోమలపెంట నుంచి వాహనాల రద్దీ ఎకువగా ఉంది. ఈ చెక్ పోస్టుల మీదుగా సగటున 1,000 వాహనాలు వెళ్తుండగా, వారాంతాల్లో 3,500 వరకు వస్తుంటాయి. సందర్శకులు ఎటువంటి ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను తీసుకెళ్లకుండా చెక్‌పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు 16 మంది స్థానిక చెంచు గిరిజనులను అటవీశాఖ నియమించింది. ఒకో చెంచు మూడు కిలోమీటర్ల మేర వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఆ తర్వాత రవాణా వాహనం వాటి నుంచి వ్యర్థాలను తీసుకెళ్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సేకరించిన వ్యర్థాలను మన్ననూర్లోని బెయిలింగ్ యూనిట్‌కు తరలిస్తున్నారు. ఒక లీటర్ బాటిళ్లపై అటవీశాఖ కఠినమైన నిషేధం విధించడంతో, సందర్శకులు రెండు లీటర్లు, ఐదు లీటర్ల బాటిళ్లను తెచ్చుకొని రోడ్లపై పడేస్తున్నారు. సందర్శకుల సౌకర్యార్థం అటవీశాఖ మన్ననూర్‌లో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.