ఆమనగల్లు, జనవరి 11 : గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో శనివారం ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లలిత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య హాజరై రైతుల అభిప్రాయాలు సేకరించారు. అధికారులు తమ భూముల జోలికి రావొద్దని రైతులు తేల్చిచెప్పారు. కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి ఉన్నందున, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు వల్ల తమకు ఉపయోగం లేదని అన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సర్వేకు సహకరించాలని రైతులను కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.