Manukota | మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి (930పీ) నల్లగొండ జిల్లా వలిగొండ నుంచి భద్రాచలం వరకు అధికారులు సర్వే ప్రారంభించారు. అనేక ఏండ్లుగా భూములను నమ్ముకొని జీవిస్తున్నామని, చావనైనా చస్తాం.. కానీ, జాతీయ రహదారికి తమ భూములను ఇచ్చేది లేదని తండావాసులు భూక్యా అనుసూర్య, కల్యాణి, హచ్చి తేల్చి చెప్పారు. పచ్చని పంట పొలాలతోపాటు తమ ఇండ్ల మధ్య నుంచి వలిగొండ టు భద్రాచలం జాతీయ రహదారిని వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కావాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు డిజైన్ మార్చి కొత్త అలైన్మెంట్తో సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రహదారి కారణంగా సుమారు 140 మంది ఇండ్లు, పచ్చని పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని తండావాసులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తండావాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తండావాసులను వ్యాన్లో ఎక్కించి కురవి పోలీస్ స్టేషన్కు తరలించారు.