హుజూర్నగర్ రూరల్, మే 6 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం భూసేకరణకు వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను వారు అడ్డుకున్నారు. తాము సాగు చేసే భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని వారితో వాగ్వాదానికి దిగారు. హుజూర్నగర్ మండల పరిధిలోని బూరుగడ్డలో 604 సర్వే నంబర్లో 164 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, గతంలో సుమారు 60 మంది రైతులకు 60 ఎకరాలను ప్రభుత్వం పట్టాలు చేసి ఇచ్చిందని వారు తెలిపారు. మిగిలిన 100 ఎకరాలను రైతులను సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి కౌలు చెల్లిస్తున్నట్టు చెప్పారు.
ఈ భూమి అంతా పెద్ద చెరువు ప్రాంతం కిందికి వస్తుందని, దాదాపు 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. కాగా 604 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే చేసేందుకు రాగా రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో భూసేకరణ సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. గతంలో హుజూర్నగర్లో పనిచేసిన తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ వారి కుటుంబ సభ్యుల పేరుమీద సుమారు 12ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం మా పంట పొలాలను గుంజుకోవాలని చూస్తున్నది. ఏదేమైనా మేము మాత్రం భూములు ఇచ్చేది లేదు. మాకున్నదే 30 గుంటలు. దీనిపైనే ఆధారపడి బతుకుతున్నం. ఇది పోతే మాకు జీవనాధారం లేదు.