Future City | రంగారెడ్డి, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం ఓవైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాలను సేకరించింది. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడుకోగా, 16 వేల ఎకరాలు అదనంగా అవసరం ఉండ టంతో కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఫ్యూచర్ సిటీని 815 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలోని 30 వేల ఎకరాల్లో సుమారు 815 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఏడు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు 74 గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్‌సిటీ విస్తరించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఇప్పటికే యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతోపాటు కందుకూరు మండలం ఆకులమైలారం, ముచ్చర్ల, పంజాగూడ, మీరఖాన్‌పేట్, తదితర గ్రామాల్లో 14 వేల ఎకరాల భూములను సేకరించారు.
ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా మరో 16 వేల ఎకరాలను కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో సేకరించడం కోసం గతంలోనే ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటికే భూసేకరణ చేపట్టిన గ్రామాల్లో రైతులు పట్టా భూములు ఇవ్వబోమని కోర్టును ఆశ్రయించడంతోపాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. 2,500 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. కోర్టు కూడా బలవంతంగా భూములనుసేకరించొద్దని అధికారులను ఆదేశించింది. అయినా ప్రభుత్వం యాచారం మండలంలోని నాలుగు గ్రామాల్లో ఉన్న 2,500 ఎకరాలకు సంబంధించి పట్టా భూముల పరిహారాన్ని అథారిటీలో జమచేసి పట్టాకాలం నుంచి రైతులను తొలగించి ఆ భూములను టీఎస్ఐఐసీ ఆధీనంలో చేర్చుకున్నది. దీంతో తమ భూములు తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొనసాగుతుండగానే, మరో 16 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఫ్యూచర్ సిటీని ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, సాగర్, శ్రీశైలం హైవేల మధ్యన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకవైపు ఆందోళనలు కొనసాగుతండగా, మరో 16 వేల ఎకరాల భూమి సేకరణ సాధ్యమయ్యే పనేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.