హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఇచ్చినా హామీలన్నింటినీ తుంగలో తొక్కి తీరని ద్రోహానికి పాల్పడిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్నాయక్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన, ఆదివాసీలకు అనేక హామీలను ఇచ్చిందని గుర్తుచేశారు. వాటిని నేటికీ అమలు చేయకపోగా, సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో లంబాడీ మహిళలపై చేసిన దుర్మార్గం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. గిరిజన జాతి గౌరవాన్ని దెబ్బతీయడమే రేవంత్లక్ష్యమని విమర్శించారు. లంబాడీ జాతినే గిరిజన జాబితా నుంచి తీసేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, నయవంచక కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. కేసీఆర్ వెన్నంటే నిలుద్దామని ఆయన పిలుపునిచ్చారు.