సిరిసిల్ల రూరల్, నవంబర్ 28: తన తల్లి వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కొడుకు కూడాఅదే వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచికట్ల లలిత-దేవరాజం దంపతులకు కొడుకు అభిలాష్ (33), కూతుళ్లు మౌనిక, మానస ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు గతంలోనే వివాహం చేశారు. దేవరాజం ఆరేండ్ల క్రితం మురుగు కాలువలో పడి మృతి చెందాడు. కొడుకు అభిలాష్‌కు 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం 17వ పోలీస్ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. అభిలాష్‌కు వివాహం చేయడానికి సంబంధాలు చూస్తున్నారు. భర్త మృతి చెందినప్పటి నుంచి లలిత కొంత అనారోగ్యంతో బాధపడుతున్నది.
ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన లలిత రాత్రయినా తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం తంగళ్లపల్లి ఠాణాలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలో సిరిసిల్ల మానేరువాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని, వెలికి తీశారు. తల్లి మృతదేహాన్ని చూసి కొడుకు అభిలాష్ భోరున విలపించాడు.
పోలీసులు, స్థానికులు అందరూ చూస్తుండగానే వారి ముందే అభిలాష్ మానేరువాగులోకి దూకాడు. అక్కడ ఉన్న ఎవరికీ ఈత రాకపోవడంతో కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. తల్లి లలిత, కొడుకు అభిలాష్ మృతదేహాలను సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.