హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఆర్టీసీలో ఉద్యోగులకు ఉద్యోగ విరమణ పొందిన రోజే ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఆనవాయితీ. కానీ, ఇది గతంగా మారిందని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వేల మందికిపైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. వీరు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికీ ఎదరుచూపులు తప్పడం లేదు. 2022 ఏప్రిల్ వరకు ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ అందించడంతోపాటు 2024 జనవరి వరకు గ్రాట్యుటీ కూడా చెల్లించారు. ఇక ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారికి ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. కనీసం బస్భవన్లోనూ ఇందుకు సంబంధించిన సమాచారం లేదని వాపోతున్నారు.
సాధారణంగా రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అనేవి ముఖ్యం. వీటితో భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ, ఆ మొత్తం చేతికందకపోవటంతో గందరగోళానికి గురవుతున్నారు. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు, ఈడీ లాంటి పెద్ద పోస్టు అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగులకు పెండింగ్ బాండ్ల డబ్బులు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షననర వరకు అందాల్సి ఉన్నది. దాదాపు 1500 మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉద్యోగకాలంలో పోగైన 300 ఆర్జిత సెలవుల(ఈఎల్స్)ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. అవి కూడా ఆగిపోయాయి. బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు థామస్‌రెడ్డి, యాదయ్య, కమాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.