హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అధోగతి అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ స్పష్టంచేశారు. సమైక్య పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను కేసీఆర్ విముక్తి చేశారని గుర్తుచేశారు. పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత సంపత్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రూ.27 వేల కోట్లు ఖర్చుచేసి పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశారని వివరించారు. కానీ పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో అదే ప్రాజెక్టుకు నయాపైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఉన్నత పదవిలో ఉన్నాననే సోయి తప్పి రేవంత్‌రెడ్డి కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరు ప్రాజెక్టుపై ప్రశ్నించిన కేసీఆర్‌పై పిచ్చి ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి లాగులో తొండలు వదులుతా.. గుడ్లు పీకి గోటీలాడతా అని మాట్లాడటం గర్హనీయమని పేర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రా? లేక తొండలాడించే వ్యక్తా? అని ఎద్దేవా చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించి, మెదడును రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ చావును కోరడం బాధాకరమని పేర్కొన్నారు. కేసీఆర్‌ను దూషిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. రేవంత్ తీరు, మాటలు వినే గ్లోబల్ సమ్మిట్‌కు సినిమా హీరోలు తప్ప పారిశ్రామికవేత్తలు రాలేదని చురకలంటించారు. సినిమా హీరోలకంటే అందంగా ఉన్న కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి సొల్లు కూతలు మాని ఒల్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు ఉడుత ఊపులకు భయపడే వాళ్లెవరూ లేరని క్యామ మల్లేశ్ తేల్చిచెప్పారు. కేసీఆర్‌కు సౌరకుటుంబం అంత సైన్యం ఉన్నదని, మైనంపల్లి దాడులు చేస్తే చేతులు ముడుచుకొని ఎవరూ కూర్చోరని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామని పిచ్చిగా మాట్లాడితే ఊరుకొనే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లోనూ ఆయన స్థానం గల్లంతవడం ఖాయని జోస్యం చెప్పారు.
మోర్తాడ్, డిసెంబర్ 28: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గల్లంతు కావడంతో, ఆ పార్టీ ఎంపీ అర్వింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేలను తానే గెలిపించానని చెప్పుకునే అర్వింద్.. సర్పంచులను ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు.
ఉద్యమనేతగా రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను తక్కువచేసి మాట్లాడే హక్కు ఎంపీకి లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా రాష్ర్టానికి వారు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విమర్శలు మానుకుని, కేంద్రం నుంచి నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీ ఎంపీలు రేవంత్డైరెక్షన్లో పనిచేస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి శృంగభంగం తప్పదని తెలిపారు.