హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, గాజులరామారంలో మూడురోజులపాటు జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు శుక్రవారం ముగిశాయి.
చివరి రోజున నూతన రాష్ట్ర కౌన్సిల్, కార్యవర్గం, కార్యదర్శి వర్గం, కార్యదర్శిని ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ నూతన కౌన్సిల్ను 152 మంది సభ్యులతో ఎన్నుకొన్నారు. వీరిలో 101 మందితో రాష్ట్ర కార్యవర్గం, 30 మంది ఆహ్వానితులను, 11 మంది సెంట్రల్ కమిషన్ను ఎన్నుకొన్నారు. కార్యదర్శివర్గం నూతన రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావును ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కూనంనేని మూడేండ్లపాటు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగనున్నారు.
రాష్టంలో ధరణి పోయి భూభారతి వచ్చినా క్షేత్రస్థాయిలో నెలకొన్న భూసమస్యలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఇప్పటికీ గ్రామ స్థాయిలో భూ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిషరించే దిశగా ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ మహాసభలో మూడోరోజు చాడ వెంకట్రెడ్డి మాట్లాడారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చర్రిత కలిగిన ఎర్రజెండా వద్దకు వెళ్తేనే తమకు దొరుకుతుందనే నమ్మకం నేటికీ పేదల ప్రజలలో ఉండటం సీపీఐకి గర్వకారణమని అన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునే విధంగా భూపోరాటాల ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. శాసనసభ, శాసనమండలిలో బడుగు, బలహీన, కార్మిక వర్గాల సమస్యల పరిషారానికి మరింత కృషి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టిన రాజకీయ, నిర్మాణ నివేదికపై జరిగిన చర్చలో ఆయన ఈ సందర్భంగా పాల్గొన్నారు.