జైనూర్/చెన్నూర్ రూరల్, జూన్ 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జైనూర్ మండలం పానాపటార్ గ్రామ పంచాయతీ పరిధిలోగల గోలేటినగర్ గ్రామంలో ఈదురు గాలులకు ఓ రెండు ఇండ్ల పైకప్పు రేకులు, పెంకులు గాలికి లేచిపోయాయి. విద్యుత్తు స్తంభం విరిగి ఇండ్లపై పడింది. ఓ ఇంట్లోని సామగ్రి తడిసి ముద్దయ్యింది.
సాగు కోసం తీసుకొచ్చిన రూ. 30 వేల విలువైన విత్తనాలు, ఎరువులు తడవడం నష్టంజరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఆస్నాద్, రచ్చపల్లి, బీరెల్లి, నాగాపూర్, సోమన్‌పల్లి, కొమ్మెర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలుతో కూడిన వర్షం పడింది. ఆస్నాద్ ప్రధాన రహదారిలో ఉన్న చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. ఇంటిముందు ఉన్న రేకులు గాలికి లేచిపోయాయి. కిష్టంపేటలో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయి.