Madhavaram | స్మశాన వాటికలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని హిందూ, ముస్లి, క్రిస్టియన్ స్మశాన వాటికలను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాసరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో స్మశానవాటికలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగా, కాంగ్రెస్ పాలనలో వాటికి పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. కేపీహెచ్‌బీకాలనీలోని ముస్లిం స్మశానవాటికకు ముఖద్వారం నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. క్రిస్టియన్ స్మశాన వాటికకు ప్రహరీ గోడలు నిర్మించి, మూత్రశాలలను ఏర్పాటు చేయాలన్నారు. స్మశానవాటికల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు.
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్లోని ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, భగత్‌సింగ్ నగర్ కాలనీల మధ్య లింక్‌రోడ్డును అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కాలనీలో పార్కును అభివృద్ధి చేసి వాలీబాల్ కోర్టుగా తీర్చిదిద్ధాలన్నారు. డైమండ్ ఎస్టేట్స్‌లో ఓపెన్ ప్లేస్ ప్లోరింగ్ పనులను పూర్తి చేసి, దాని చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలని, బోరుబావిని అందుబాటులోకి తేవాలన్నారు. ఆయా కాలనీలలో చేపట్టిన పార్కుల అభివృద్ధి పనులను పూర్తిచేయడం లేదన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలవుతుందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డీఈ శంకర్, ఏఈ సాయిప్రసాద్, జలమండలి మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు సాయిబాబాదరి, వెంకట్‌రెడ్డి, పవన్, రాజేష్‌రాయ్, పాతూరి గోపి, పీఎల్ ప్రసాద్, పంచగంగేశ్వర్, సూర్యనారాయణ, భవాని, భారతి, చంద్రకాంతమ్మ, యూనస్ తదితరులు పాల్గొన్నారు.