KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అది ఉంటుందో, లేదో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీపై హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని కోరారు. అలా చేయకుంటే అది ముమ్మాటికీ చీటింగ్ కిందికి వస్తుందని, ఇలాంటి నేరానికి పాల్పడుతున్న రాష్ట్ర సరారుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేవలం తన సోదరులకు, అనయాయులకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే కుంభకోణంలో భాగంగానే రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే కాకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దుచేస్తున్నామని, ఆ స్థానంలో ఫార్మా విలేజీలు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుచేస్తామని అనేక వేదికలతోపాటు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో మాయమాటలతో మభ్యపెట్టి, అనేక ఆర్థిక అవకతవకలకు, భూదందాలకు ప్రభుత్వం తెరలేపుతున్నదని విమర్శించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ సరార్ సెచ్ వేసిందని ఆరోపించారు. సరార్ చేస్తున్న ఈ మాయాజాలం రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైందని పేర్కొన్నారు.
హైకోర్టు ముందు వాస్తవాలు దాచే కుట్ర
కాంగ్రెస్ పార్టీ చేసిన భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మాసిటీ భూములను ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం లేనేలేదని తెలిసిన తర్వాత కూడా వాటన్నింటినీ తుంగలో తొకి హైకోర్టు ముందు వాస్తవాలను దాచే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సహా పలు మీడియా సమావేశాల్లో సీఎం, మంత్రులు ప్రకటించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాగితాలపైన హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదనే మాట చెప్తూ మరోవైపు తమ భూదందాల కోసం అదే స్థానంలో పేర్లు మార్చి ఫార్మాసిటీ భూములను అప్పనంగా వాడుకునే కుతంత్రం నడుస్తున్నదని దుయ్యబట్టారు.
ఫార్మా భూములను ‘రియల్’పరం కానివ్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాల్లో రూ. 64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మా సిటీని ప్రతిపాదించినట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం హైదరాబాద్ ఫార్మాసిటీకి భూములు ఇచ్చి ముందుకు వచ్చిన వేలాదిమంది రైతులకు తమ భూమిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తున్నదో తెలుసుకునే హకు ఉన్నదని స్పష్టం చేశారు. సదుద్దేశంతో ఇచ్చిన భూములను దుర్వినియోగం చేస్తామంటే కుదరదని, ముఖ్యమంత్రి, తన కుటుంబ సభ్యులు ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఫార్మాసిటీ తాము ప్రతిపాదించిన 14 వేల ఎకరాల్లో ఉండాలని, లేదంటే రైతులకు వారిచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి విధానాలను, అసంబద్ధ ప్రకటనలను పకన పెట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టును, న్యాయమూర్తులను రేపు కోర్టులో సమర్పించే అఫిడవిట్ లేదా వినిపించే వాదనల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును, న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు చెప్తున్నది. ఇది ఎంతోకాలం సాగదు. ఒక ఎకరం సేకరించకుండా, హైకోర్టుకు చెప్పినట్టు ఫార్మాసిటీని రద్దు చేయకుండా కాంగ్రెస్ సరారు చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి?
– కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆలోచనలతో ఫార్మాసిటీ భూములను అప్పనంగా వాడుకొని వేలకోట్లు సంపాదించాలని చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతుంది. ఫార్మాసిటీ పూర్తయితే లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఖజనాకు భారీగా ఆదాయం వస్తుంది. అలాకాకుండా ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వాళ్లవుతారు.
– కేటీఆర్