హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వదిలి, ప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. లేకుంటే సీఎంకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేవంత్‌రెడ్డికి కేటీఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. లేఖ యధాతథంగా..
అంబేద్కర్‌ను అవమానిస్తున్నరు..
‘మీ పాలనలో పౌరుల హకులను తొకేస్తూ, రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నరు. రాహుల్‌గాంధీ రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెప్తారు. కానీ, మీ ప్రభుత్వం అన్ని రాజ్యాం గ ప్రమాణాలను, విలువలను, స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నది. రాజ్యాంగ రూపకర్త, అంబేదర్కు గౌరవ సూచకంగా కేసీఆర్ ప్రభుత్వం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌పై మీకున్న వ్యక్తిగత వ్యతిరేకత వల్ల మీరు ఆ విగ్రహాన్ని ఒకసారైనా గౌరవించకపోవడం చూసి చాలా బాధ కలుగుతున్నది. ఇది భారత రాజ్యాంగ రూపకర్తకు నేరుగా మీరు చేస్తున్న అవమానం.
ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులా?
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. యాంటీ-డిఫెక్షన్ చట్టాన్ని విస్మరించి, బీఆర్ఎస్ నుంచి చట్టవ్యతిరేకంగా వచ్చిన ఎమ్మెల్యేలకు మీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇస్తున్నది. భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హకు ల్లో ప్రసంగ స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(ఎ)) కీలకమైనది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హకును తొకిపెట్టడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. మీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిపై, చివరికి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా సరే, వారిపై తప్పుడు కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. వాక్ స్వాతంత్య్రంలో కీలకమైన ప్రెస్ స్వేచ్ఛ తెలంగాణలో దాడులకు గురవుతున్నది. మీడియా ప్రతినిధులపై శారీరక దాడులు, తప్పుడు కేసులు నమోదు చేయడం మీ ప్రభుత్వం అరాచకత్వాన్ని బహిర్గతం చేస్తున్నది.
రాజ్యాంగేతర శక్తులుగా మీ సోదరులు
మీ 11 నెలల పాలనలో పోలీసుల వేధింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకొని మానసిక, శారీరక వేధింపులకు గురిచేసిన అనేక ఘటనలు వెలుగుచూశాయి. మీ పాలన కింద తెలంగాణ పోలీస్ రాజ్యంగా మారింది. ఇంతటితో ఆగకుండా, మీ కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మీ సోదరులు క్విడ్ ప్రో కో విధానంలో నేరుగా లబ్ధిపొందుతున్నారు. హైడ్రాతో ఇష్టమొచ్చినట్టు కూల్చివేతలు చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ విధమైన కూల్చివేతలను రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మీరు ప్రజలకు మార్పు అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ మార్పు ఒక మోసం అని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. సమాజంలోని వివిధవర్గాలు మీ రాజ్యాంగ వ్యతిరేక, అసమర్థ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి
తెలంగాణలో రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించాలని ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన న్యా యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి గౌరవం చూపించేలా రాజ్యాంగ హకు లు, స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు పరిపాలన అందించాలని సూచిస్తున్నా. ప్రజలు, మా లాంటి పార్టీలు మీ తీరు మార్చుకొని, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చేస్తున్న విజ్ఞప్తులు, డిమాండ్లను పట్టించుకోకుండా నియంతృత్వంతో, అప్రజాస్వామికంగా మీరు రాజ్యాంగ వ్యతిరేకపాలనను కొనసాగిస్తే, ప్రజలే మీకు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.