వరంగల్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ దెబ్బతో కాంగ్రెస్ ప్ర భుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న కన్నెపల్లిలో పర్యటించడం, గోదావరిలో నీళ్లున్నప్పటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉద్దేశపూర్వకంగానే దిగువకు విడిచిపెడుతున్నదనే విషయాన్ని కుండ బద్ధలు కొట్టినట్టు వెల్లడించడంతో ప్రభుత్వ పెద్దలు ఎట్టకేలకు గోదారి బాట పట్టారు. కానీ, కన్నెపల్లికి వెళ్లి గోదావరిని పరిశీలిస్తే తమ సర్కార్ నవ్వుల పాలవుతుందన్న భయంతో సోమవా రం దేవాదుల ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఐదు నెలల క్రితం బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు దేవాదుల ప్రాజెక్టులో భాగమైన దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిధం గా వ్యవహరించింది. వరిరైతులను ఆదుకునేందుకు వెంటనే దేవాదుల పంపులను ఆన్ చేయాలని ఆ పర్యటన సందర్భంగా హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో మరుసటి రోజు తెల్లారే (ఫిబ్రవరి 22న) సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదులలో పర్యటించారు.
రైతుల కష్టాలను దూరం చేయాలని బీఆర్ఎస్ అడిగితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గోదావరి నీటి వినియోగ అంశమే ఇందుకు ఇందుకు తాజా నిదర్శనం. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన కన్నెపల్లి పంప్‌హస్ వద్ద గోదావరి నీటి లభ్యతను పరిశీలించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక వైఖరిని కేటీఆర్ తూర్పారబట్టారు. దీంతో ఉక్కిరి బిక్కిరైన రేవంత్‌రెడ్డి.. స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, గోదావరిలో నీళ్లు ఉన్నాయని అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటును సాకుగా చూపుతూ నీళ్లు ఎత్తిపోయబోమని తేల్చిచెప్పారు. దీంతో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని కాళేశ్వరం పరీవాహక ప్రాంతంలోని రైతులతోపాటు రిటైర్డు ఇంజినీర్లు, తెలంగాణ మేధోసమాజం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పెద్దలు గోదావరిని పరిశీలించేందుకు దేవాదులకు పయనమవుతున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ అడుగడుగునా ముచ్చెమటలు పట్టిస్తున్నది. గోదావరిలో నీరున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులకు సాగునీటి కష్టాలు తెచ్చిపెడుతున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఫిబ్రవరి 21న దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించి దుయ్యబట్టడంతో ఆ మరుసటి రోజే సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి తీరంలోని దేవాదుల ప్రాజెక్టు పనితీరుపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఇదేవిధంగా కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద దాదాపు 1 లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నదని, అయినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు కండ్లల్లో ఆనందం కోసమే గోదావరి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న ధ్వజమెత్తారు. ఆ నీటిని ఎత్తిపోయకుంటే వేలాదిగా తరలివచ్చి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని అల్టిమేటం జారీచేయడంతో కాంగ్రెస్ సర్కార్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గోదావరి నీటిపారుదల, వరద ప్రవాహం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, కన్నెపల్లి పంప్‌హౌస్ తదితర అంశాలపై నోరు విప్పారు. ఈ నేపథ్యంలో తక్షణ ఉపశమన చర్యగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క తదితరులు సోమవారం దేవాదుల వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించనున్నారు.