హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో వికాసం లేదు.. ఎక్కడచూసినా విలాపమే కనిపిస్తున్నది.. ఒక్క రేవంత్‌రెడ్డి బ్రదర్స్ మాత్రమే విలాసవంతంగా గడుపుతుంటే.. యువత మాత్రం విలపిస్తున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘రాజీవ్ యువవికాసం స్కీమ్‌ను అసెంబ్లీలో ప్రారంభించారు. అద్భుతాలు చేస్తామన్నారు.. మరి రాజీవ్ యువవికాసమున్నదా? ఎవరికైనా రూపాయి వచ్చిందా?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తాము కష్టపడి ప్రైవేట్ రంగంలో 26లక్షల కొలువులు సృష్టించామని.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు పక్కనపెడితే ప్రైవేట్ ఉద్యోగాలను సైతం అటకెక్కించిందని విమర్శించారు. ‘మా పాలనలో ఐటీ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయింది. 3.23 లక్షల ఉద్యోగాలను 9.46లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్ సర్కార్ సొంతం. దేశంలో సృష్టించబడే ప్రతి మూడు ఐటీ కొలువుల్లో ఒకటి హైదరాబాద్‌లోనే. జాబులజాతర అంటే ఇది. ఇందుకు గర్వపడుతున్నాం’ అంటూ బీఆర్ఎస్ ఘనతను వివరించారు. చిల్లర మాటలు మాట్లాడలేదని, ఉన్మాద చర్యలకు పాల్పలేదని చెప్పారు.
టీ హబ్ వేదికగానే స్కైరూట్ పురుడు..
స్కైరూట్ సంస్థ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. టీహబ్‌లో పురుడుపోసుకున్న స్కైరూట్ కంపెనీ ప్రైవేట్ రాకెట్‌ను శనివారం అంతరిక్షంలోకి విజయవంతంగా పంపిందని పేర్కొన్నారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతంలోనే కాదు.. ప్రపంచంలోనే మొదటిసారిగా స్కైరూట్ ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిందని.. స్కైరూట్ కంపెనీని అభినందించాలని సభికులకు పిలుపునిచ్చారు. తాము యువత ఊహలకు రెక్కలొచ్చి.. ఆలోచలను ఆవిష్కరణలు మార్చే గొప్ప వేదికలు అయిన టీహబ్.. టీవర్క్స్‌ను సృష్టించామని చెప్పారు.
అన్నీ హిట్లర్.. బట్లర్ మాటలే..
ఫీజు బకాయిలడిగితే కాలేజీ విద్యార్థులను కాంగ్రెస్ పాలకులు బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఇంజినీర్లు మాట్లాడితే చర్లపల్లి జైల్లో వేస్తానని, ఎల్ నినో వస్తుందని నీళ్లు ఇవ్వాలని శాస్త్రవేత్తలంటే బెల్ట్ ట్రీట్మెంట్ అంటూ హెచ్చరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు డీఏలు అడిగితే ఏసీబీ దాడులు చేయిస్తున్నారని, ఎస్బీఐని బెదిరిస్తా.. ఎల్అండ్టీని బెదిరిస్తా.. నేనే రాజు.. నేనే మంత్రి.. అని రేవంత్ హిట్లర్.. బట్లర్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ ముఖ్యమంత్రిలా కాకుండా రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
బూతుల వరద.. అవినీతి బురద
రాష్ట్రంలో బుల్డోజర్ల విధ్వంసం.. బూతుల వరద.. అవినీతి బురద అన్నట్టు పరిస్థితులున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అవినీతి పరుడు.. ఒక అవివేకి.. రాష్ర్టాన్ని బికారి రాష్ట్రమంటున్నడు.. కాంగ్రెస్ పాలకుల అసమర్థతకు ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు. ‘మేము మీలాగ చిల్లర మాటలు చెప్పలే.. గూగుల్, యాపిల్ వంటి సంస్థలను రప్పించినం. పేగులు మెడలో వేసుకొని ఊరేగుతమని వాగలేదు.. ఫాక్స్‌కాన్ లాంటి దిగ్గజాలను తెచ్చినం. అమెజాన్, అమరరాజా కంపెనీలను ఎవరు తెచ్చిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం కాదా? మేం తెచ్చిన ఫ్లై ఓవర్లకు సున్నం పూస్తరు. కంపెనీల రిబ్బన్లు కట్‌చేస్తున్నరు’ అంటూ కాంగ్రెస్ వైఫల్యాలను వివరించారు.
తన్నుకుపోతుంటే జాతీయవాదమా?
తెలంగాణకు అన్యాయం చేస్తూ.. గుజరాత్‌కు పరిశ్రమలను తరలించడం జాతీయవాదమవుతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కంపెనీలను బీజేపీ తరలించుకుపోతుంటే.. కాంగ్రెస్ ఆపే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని అడిగితే.. ప్రాంతీయవాదమంటున్నరు.. తెలంగాణ కంపెనీలను గుజరాత్‌కు ఎత్తుకుపోవడం జాతీయవాదమవుతుందా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ కష్టంతో వచ్చిన కేన్స్.. మైక్రాన్ పరిశ్రమలను గుజరాత్‌కు గద్దల్లా మోదీ తన్నుకుపోతుంటే జాతీయవాదమవుతుందా? బీజేపీ ఎంత అవకాశవాదో అంతా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల కష్టాలు మాకు తెలుసు
కొలువు కొట్టడం ఎంత కష్టమో తమకు తెలుసని, నిరుద్యోగులపై పూర్తి అవగాహన ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవడం, పరీక్షలు రాయడం, ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం, ఫైనల్‌గా ఉద్యోగం సాధించేవరకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు. ‘ఇరుకిరుకు రూముల్లో.. ఐదుగురు.. సర్దుకుంటూ .. సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ, చాయ్సమోసాలతో కడుపునింపుకోవడం.. తల్లిదండ్రులకు భారం కాకూడదని పాకెట్ మనీ కోసం పడే బాధలు.. పార్ట్‌టైమ్ జాబ్‌ల గోసపడుతూ పడే అవస్థలు గమనిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు.
నిరుద్యోగులతో పరిహాసమా?
నిరుద్యోగ యువతతో కాంగ్రెస్, బీజేపీలు పరిహాసమాడుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బడే భాయ్ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానంటే.. చోటే భాయ్.. రెండు లక్షల ఉద్యోగాలిస్తానన్నడు. రెండు కోట్లు నై.. రెండు లక్షలు నైనై.. అన్నట్టుగా పరిస్థితులున్నాయన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగితే చేగోడిలేసుకోండి? అంటూ సలహా ఇస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
రేవంత్.. బండికి పరీక్ష రాసే దమ్మున్నదా?
నిరుద్యోగుల కష్టాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఏం తెలుసని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డికో.. బండి సంజయ్‌కో పోటీ పరీక్షలు రాసే దమ్మున్నదా? అంటూ నిలదీశారు. ‘ఈ ఇద్దరు ఏం చదివిండ్రో ఎవరికీ తెలియదు. నకల్ కొట్టే బ్యాచ్. గోడ మీద సున్నం కొట్టడం తప్ప జీవితంలో ఒక్క జాబ్ అయినా కొట్టిండ్రా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లు నిరుద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని చురకలంటించారు. తాను నిరుద్యోగుల్లాగే కష్టపడి చదువుకున్నానని.. నిజాం కాలేజీలో డిగ్రీ చేశానని కేటీఆర్ గుర్తు చేశారు. ‘దేశంలో 16 యూనివర్సిటీల్లోనే బయోటెక్నాలజీ మాస్టర్స్ కోర్సు ఉండేది.. జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష పెడితే లక్షల మంది రాస్తే. నాకు పుణె యూనివర్సిటీలో సీటు వచ్చింది’ అని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎమ్మెస్సీ చదువుకొని జీమ్యాట్ పరీక్ష రాసి.. అమెరికాలో ఎంబీఏ చేసి ఇంటర్వ్యూలకు హాజరై.. ఏ సిఫారసు లేకుండా కష్టపడి ఉద్యోగాలు సంపాదించానని చెప్పారు.
తెర్లయిపోతుంటే.. ఊరుకోవాల్నా?
తెచ్చుకున్న తెలంగాణ తర్లైపోతుంటే యువత ఊరుకోవాల్నా? అనేది ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘నేపాల్ లాగా భూకంపం సృష్టించాలని.. శ్రీలంక లాగ యువత శివతాండవం చేసి.. ప్రభుత్వాన్ని కూల్చాలని అడుగటంలేదు.. విధ్వంసం, అల్లర్లు, రెచ్చగొట్టి.. చిచ్చుపెట్టి కేసుల్లో ఇరికించాలని అనుకోవడం లేదు’ అన్నారు. ఉద్యమ కాలంలో పిల్లల రక్తం చిందొద్దని కేసీఆర్ అనేక సార్లు చెప్పారని.. ఇప్పుడు కూడా తమది అదే విధానమని స్పష్టంచేశారు. నిరుద్యోగుల బాధ్యత గొప్పదని.. ఉద్యోగాలు.. నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాకుండా.. ఎలా ఉన్న రాష్ట్రం ఎలా అయ్యిందో ఆలోచించాలని కోరారు. 2028లో ఆరునూరైనా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు అన్నగా అండగా ఉంటానని.. అందరి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. అలాంటి వాటికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా కొలువులను భర్తీచేస్తామని, జాబ్ క్యాలెండర్ అమలుచేస్తామని చెప్పారు.
తండాల్లో వెలుగులు నింపిన కేసీఆర్
తెలంగాణ ఏర్పడగానే మారుమూల గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది. గిరిజన గురుకులాలను తీసుకొచ్చి మా తండాల్లో వెలుగులు నింపారు. మా తల్లిదండ్రులు మిరపతోటల్లో రాత్రీపగలు పనిచేసి పోగుచేసిన డబ్బులు పంపిస్తే ఇక్కడ కోచింగ్ తీసుకొని చదువుకుంటున్నం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మమ్మల్ని రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరిట మోసంచేసి మమ్మల్ని ఎండ్రిన్ తాగి చావమంటున్నది. అశోక్‌నగర్ వచ్చి చాయ్ తాగి కబుర్లు చెప్పి కంటికి కనబడకుండా పోయిన రాహుల్‌గాంధీ.. ఇంకోసారి తెలంగాణకు వస్తే అంతు చూస్తం. నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తం. – ప్రత్యూష రాథోడ్, నిరుద్యోగి
రైతులకు నీళ్లు లేవు… నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నది. రైతుబంధు, సాగునీరు అందక అన్నదాతలు అవస్థలు పడుతుంటే.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. అక్కడ రైతులను రక్తంతో పొలాలు పారించుకోమంటున్నరు.. ఇక్కడ నిరుదోగ్యులను ఎండ్రిన్ తాగమంటున్నరు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నరు. వయో పరిమితి పెంచి మేం ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకుండా చేస్తున్నరు. రేవంత్‌రెడ్డిని ఓడగొట్టి మా ఉద్యోగాలను మేం సాధించుకుంటం. – ఆకాశ్, నిరుద్యోగి

పటాన్చెరు నుంచి యువ సంగ్రామ సదస్సుకు భారీ కాన్వాయ్‌తో వస్తున్న నేతలు

సరూర్‌నగర్ సభావేదికపై మాజీమంత్రులు మహమూద్ అలీ, సబిత, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గండ్ర రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు

యువ సంగ్రామ సదస్సుకు ర్యాలీగా వెళ్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్వీ నేతలు

యువ సంగ్రామ సదస్సు ప్రాంగణంలో టీస్టాల్ ఏర్పాటు చేసి రాష్ట్ర సర్కార్‌కు నిరసన తెలుపుతున్న నిరుద్యోగి జగదీశ్