Minister KTR | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. రెండోదశ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష లేఖలో ఎండగట్టడంతో పాటు అన్యాయాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS) విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. కరువు పీడిత ప్రాంతాలైన నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణంలాంటిదని పేర్కొన్నారు. 12.5 లక్షల ఎకరాలకుపైగా భూమికి నీటిని అందించడంతో పాటు అనేక గ్రామాలకు, హైదరాబాద్ నగరం, పరిశ్రమల తాగునీటి అవసరాలను తీర్చడం పథకం ఉద్దేశమన్నారు. ప్రాజెక్టుకు జీవితాలను మార్చే సామర్థ్యం ఉందన్నారు.
గతంలో మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు నీటి కొరతతో ఇబ్బందులు పడ్డాయని తెలిపారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యలను ఎదుర్కొందని గుర్తు చేశారు. సాగునీరు లేక మహబూబ్నగర్లో వలస వెళ్లారన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణలోని ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, ఎలాంటి మద్దతు, నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనుమతుల విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లోకి ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు, జాతీయ హోదా లభిస్తున్నాయని గుర్తు చేశారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తూ వేగంగా అనుమతులు ఇచ్చి.. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా నిరాకరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ పచ్చబడటం కేంద్రానికి ఇష్టం లేదన్నారు.
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2, నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటి వాటాను తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ట్రిబ్యునల్ నీటివాటాలను తేల్చలేదన్నారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. దాంతో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ తన నీటివాటాలను ఉపయోగించుకోలేకపోతుందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు నిరాశ కలిగించిందన్నారు. రాష్ట్రం అభ్యర్థలను విస్మరిస్తున్నారని, ఇతర రాష్ట్రాల మాదిరిగా అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలబెట్టామని, తెలంగాణ అభివృద్ధి పట్ల మా నిబద్ధతను అడ్డుకోలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే శక్తులపై రాజీలేని పోరాటం చేస్తామని, కేంద్రం అనుసరిస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.