హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలపై బీఆర్ఎస్వీ పోరుకు సన్నద్ధం అవుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై విద్యార్థిలోకంలో చైతన్యం తెచ్చేందుకు సమాయత్తం అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ విద్యార్థి విభాగానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా గురువారం సమాలోచనలు సాగనున్నాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల విద్యార్థి విభాగాల బాధ్యులతోపాటు నియోజకవర్గానికి కనీసం 10 మంది విద్యార్థి నేతలు హాజరయ్యే ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శనాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థి ప్రతినిధులకు వివరించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్న విమర్శులున్నాయి. ఈ తరుణంలో బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘంగా బీఆర్ఎస్వీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు చేపట్టే ప్రణాళికలను రచించనున్నారు. విద్యావ్యవస్థలో అద్భుతాలు సృష్టించి అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా పదేండ్ల కేసీఆర్ పాలనను, రేవంత్‌రెడ్డి సర్కార్ ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేస్తున్న వైనాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో కేటీఆర్ సహా ఇతర నాయకులు విద్యార్థులకు ఉద్బోధించనున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ సమీకృత గురుకులాల ఏర్పాటు ఆంతర్యాన్ని క్షేత్రస్థాయిలోనే ఎండగట్టాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్వీ గుర్తించింది. ప్రస్తుతం ఉన్నవన్నీ సమీకృత గురుకులాలే అయినా, వాటిల్లో కల్పించాల్సిన సౌకర్యాలను, కనీసం అద్దెను చెల్లించలేని దైన్యం నెలకొన్నది. మరోవైపు కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన గురుకుల సొసైటీలను (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల పరిధిలో ఉన్న) దశలవారీగా ఎత్తివేయాలనే కుట్రను ఎండగట్టాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్వీ గుర్తించింది. కేసీఆర్ సర్కార్ కేవలం పదేండ్ల కాలంలోనే 662 గురుకులాలను ప్రారంభించడమే కాకుండా, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 75 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసి ఆదర్శంగా నిలిచిన వైనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చే కార్యాచరణను ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రూపొందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమికను పోషించిన బీఆర్ఎస్వీ ప్రస్తుతం నెలకొన్న విద్యారంగ అంశాలపై గురుతర బాధ్యతను నెరవేరాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. అందులో భాగంగానే బీఆర్ఎస్వీ ప్రతినిధుల సభలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. సత్వరమే ఫీజు రీయింబర్స్మెంట్, గురుకులాల సమస్యలపై పోరాడేందుకు సిద్ధం కానున్నది.
బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) పార్టీ నాటి ఉద్యమకాలంలో నిర్వహించిన విద్యార్థి సదస్సులు ఉమ్మడి పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. తెలంగాణ భవన్లో రాష్ట్రంలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాల విద్యార్థులకు 2008 ఆగస్టు 11 నుంచి అక్టోబర్ 9 వరకు 50 రోజులపాటు దాదాపు 21,000 మంది విద్యార్థులకు పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో శిక్షణ తరగతు జరిగాయి. ఈ సదస్సుల్లో నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక అస్తిత్వానికి జరుగుతున్న అన్యాయంపై బోధనలు జరిగాయి. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలోని విద్యార్థినులకు 2007 డిసెంబర్ 18 నుంచి 20 2,000 మందికిపైగా శిక్షణ పొందారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘విద్యార్థి సదస్సు’లు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాయి.
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు నిరసనగా తాము చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. బుధవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడే వారికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. తమ పార్టీ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు బీ సూర్యనారాయణరెడ్డి, ఏ పరమేశ్వర్, రామకృష్ణ, ఈ నరసింహాయాదవ్, రామారావు, భాస్కర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.