KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంకులా, ఏటీఎంలా ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు 300 రోజులైనా అమలు కావడంలేదని, ఇచ్చిన హామీలను పకనపెట్టి ప్రజలకు అకరకు రాని అంశంపై లక్షన్నరకోట్లు ఖర్చు పెట్టడం ఎవరికోసమని నిలదీశారు. పేదల పక్షాన హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రెండు వేల పింఛన్ నాలుగు వేలవుతుందని, రెండు లక్షల రుణమాఫీ అని, తులం బంగారంతో కల్యాణలక్ష్మిని అమలు చేస్తామని, 10వేల నుంచి 15 వేలకు రైతు బంధు పెంచుతామని, ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి, మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పారు.
వీటికి మాత్రం పైసల్లేవు, చేతులు రావు.. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా అక్కరకు రాని, అక్కరలేని, ప్రజలు కోరుకోని సుందరీకరణ కోసం, ఏ ప్రాధాన్యం లేకుండా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడుతామంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇందులో ఏం ఆశించి చేస్తున్నారో చెప్పాలి’ అని నిలదీశారు. ‘25వేల కుటుంబాలు, లక్ష మందిని నిరాశ్రయులను చేసేందుకు మూసీ బాధితుల పాలిట ముఖ్యమంత్రి కాలయముడిలా మారాడు’ అని మండిపడ్డారు. నేరం చేసిందెవరు? శిక్ష ఎవరికి వేస్తున్నారు? అని ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడే పట్టాలిచ్చారని, రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నప్పుడు, నిర్మాణాలకు అనుమతులిచ్చినప్పుడు, ఇంటి పన్ను కట్టించుకున్నప్పుడు, కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు, మంచినీళ్ల బిల్లు కట్టుమన్నప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని బాధితులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉన్నదా? అని నిలదీశారు.
మొదట వారిపై చర్యలు తీసుకోండి
ప్రభుత్వానికి దమ్ముంటే, చేతనైతే వీటికి అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టు కూడా ఇదే చెప్పిందని గుర్తుచేశారు. ‘కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.. ఈ రెండూ నాలా మీద కట్టారు.. ఇతరులకు సుద్దులు చెప్పే ముందు నీ దగ్గరి నుంచే మొదలు పెట్టు’ అని కేటీఆర్ సూచించారు.
రాహుల్, ప్రియాంక ఎక్కడ?
మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఆశోక్‌నగర్‌లో చాయ్ తాగి, బిర్యానీ తిని ఓట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. ‘మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంత మంది?, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత?, మూసీ వల్ల ఒక్క ఎకరానికైనా సాగు నీరు వస్తుందా?, ఒక్క రైతుకైనా అదనంగా నీరందుతుందా? ఒక్క రిజర్వాయర్ అయినా వస్తుందా?.. ఏమీ లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కాం కాదా’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అన్నారని, మరీ మూసీ కాంగ్రెస్‌కు ఏటీఎం కాదా? అని నిలదీశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు.
వాటికే అంతయితే..
నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు, సబర్మతి రివర్ ఫ్రంట్‌కు రూ.7,050 కోట్లు, యమున రివర్ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు ఖర్చయితే మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చట? అని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పేదల ఇండ్లు కూలగొడుతామని ముందే చెప్పి ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండేనా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీడియాకు ముఖం చాటేశారని, మీడియాతో ‘చీట్’చాట్ చేసే ఆయన, ఇప్పుడు ఏడి అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు భయం పట్టుకున్నదని, అధికారులను ముందుపెట్టి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దెప్పిపొడిచారు.
నీ జాగీరా..
‘అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ప్రజల ఇండ్లను కూలగోడుతామంటే బీఆర్ఎస్ ఉరుకోదు.. వారికి అండగా నిలబడుతాం. బుల్డోజర్లు వస్తే వాటికి ఎదురుగా మేమే నిలబడుతాం’ అని కేటీఆర్ ప్రకటించారు. ‘ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టడానికి నీ జాగీరా, నువ్వు ఉంటవు, పోతవు.. నీ విలాసాలకు, హంగులకు ఖర్చు పెడుతవా? పేదలు బలికావాల్నా’ అంటూ నిలదీశారు. ప్రజా కోర్టులో ఎండగడుతామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ముందు వాళ్లవి కూలగొట్టు..
‘సీఎం ఇంట్లో నుంచి వచ్చే మురుగునీరు ఎక్కడికి పోతుందో అదయినా తెలుసా?’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎస్టీపీలు లేవు కాబట్టి ఇండ్లు కూలగొడుతా అంటే హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా మిగలదు.. కొడంగల్‌లోని రెడ్డికుంట సర్వే నంబర్ 1138లో రేవంత్‌రెడ్డి కట్టుకున్న ఇల్లు కూలగొడుతవా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్ల మీదికి వచ్చే ముందు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అన్న ఇల్లు, జంట జలాశయాలకు 500 మీటర్ల దూరంలో ఇండ్లు ఉండవద్దని ఉన్న ఆదేశాలను అమలు చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మూసీ డీపీఆర్ తయారు కాలేదని చెప్పారని, కాకముందే ఇండ్లకు ఎందుకు మార్కింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ‘నువ్వు రెడ్ లైన్లు వేసుడు కాదు.. మేమే నీకు డెడ్లైన్లు పెడుతం’ అని హెచ్చరించారు.
రేవంత్‌కు బీజేపీ ఎంపీల భజన
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడి వారందరికీ గౌరవప్రదంగా పునరావాసం కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రాజెక్టులో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే నిబంధన ఉన్నదనే విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏం చేసినా కాంగ్రెస్ ఎంపీల కంటే బీజేపీ ఎంపీలు ఎక్కువగా తప్పెట తాళాలు వేస్తున్నారని, చెక్కభజన చేస్తున్నారని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణకు కేటాయించాలనుకున్నది రూ.16 వేల కోట్లే అని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, జీ జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, బీఆర్ఎస్ నేతలు కార్తీక్‌రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు.
ఇల్లు అనేది ఎమోషన్
‘పేద, మధ్య తరగతి వారికి జీవితకాలం చేసిన కష్టానికి ప్రతీరూపం ఇల్లు. ఇల్లు అనేది ఒక ఎమోషన్. ఆ కుటుంబం మొత్తం కలలుగనే ఒక సౌధం, అది నాలుగు ఇటుకలు, రెండు రాళ్లతో కట్టిన కట్టడం కాదు.. ఇల్లు అనేది జ్ఞాపకాల పొదరిల్లు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామంటే ఎంత బాధ ఉంటదో రేవంత్‌రెడ్డికి తెలియక పోవచ్చు కానీ నాకు తెలుసు. కేసీఆర్ కుటుంబం ఒక్కసారి కాదు.. రెండు సార్లు డిస్ప్లేస్ అయింది. నానమ్మకు చెందిన పోసాన్పల్లి అప్పర్ మానేరు డ్యాంలో 1940లో మునిగిపోతే చింతమడకకు వచ్చాం. అమ్మమ్మ గ్రామం మిడ్ మానేరులో మునిగిపోయింది. మా జ్ఞాపకాలు, ఇండ్లు అన్నీ అక్కడే పోయాయి’ అని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెసోళ్లు సునీల్ కనుగోలు డైరెక్షన్లో 500 మందిని సోషల్ మీడియాలో పెట్టి బాధితులంతా ఆక్రమణదారులని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2016లో మొదటిసారిగా హైదరాబాద్‌లో చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఖరారు చేస్తూ తమ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు.
కొనుక్కునే సంస్కృతి మీది..
ఐదు వేలు తీసుకొని మూసీ బాధితులు మాట్లాడుతున్నారంటూ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి, రూ.500కోట్లకు సీఎం పదవి అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవని ఎద్దేవా చేశారు. ‘ఆత్మగౌరవం మీద కొడితే తెలంగాణ ప్రజలు తిరగబడుతరు.. వాళ్లు తిరగబడితే కాంగ్రెసోళ్లు ఊళ్లలో తిరగలేని పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌బాబుపై కొంత గౌరవం ఉండేదని, కానీ ఆయన మాటలతో గౌరవం పోయిందని చెప్పారు.