హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ హెచ్చరించినట్టే జరిగింది. కాంగ్రెస్ సరార్ వెల్లడించిన కులగణన సర్వే నివేదిక తప్పులతడక అని తేటతెల్లమైంది. బీసీ జనాభా ఏటికేడు పెరగాలి గానీ ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అసమగ్రంగా, అశాస్త్రీయంగా నిర్వహించిన సర్వేను వ్యతిరేకించింది. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాలపై సర్వే నివేదికను వెల్లడించిన నాటి నుంచే నిరసన తెలిపింది. నివేదిక లోపభూయిష్టంగా ఉన్నదని ఆక్షేపించింది. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ న్యాయమైన డిమాండ్‌కు సర్కారు తలొగ్గింది. కులగణనకు రీసర్వే చేపడతామని ఎట్టకేలకు ప్రకటించింది.
బుధవారం రాత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. కులగణనలో వివరాలు ఇప్పటివరకు నమోదు చేసుకోనివారు ఈ నెల 16 నుంచి 28 వరకు మూడు పద్ధతుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. భట్టి ప్రకటనతో కులగణన సర్వే అసమగ్రంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయింది. కొంతమందికే కాకుండా మళ్లీ పూర్తిగా కులగణన సర్వే చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. బీసీల జనాభాను తగ్గించి వెనకబడినవర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నది.
ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలి: కేటీఆర్
కులగణన సర్వే తప్పులతడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీసీ జనాభాను తగ్గించి వెనకబడినవర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్తోపాటు బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెకల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలని హితవుపలికారు. రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపాటు బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బుధవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా తీర్మానం చేసి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్తోపాటు బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
ఈసారైనా ఇంటింటికీ పంపాలి: వద్దిరాజు
కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, తప్పులతడకగా ఉన్నదని తమ పార్టీ లెకలతోసహా నిరూపించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రీసర్వేకు అంగీకరించడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్వాగతించారు. ఈ సారైనా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, వాటన్నింటినీ క్రోడీకరించి సరైన లెకలు వెల్లడించాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే ఈమేరకు కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ తీర్మానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. రాష్ట్ర మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగింటిని బీసీలకిచ్చి ప్రాధాన్య శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మళ్లీ సమగ్ర కులగణన చేపట్టాలి: తలసాని శ్రీనివాస్‌యాదవ్
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సర్వే నివేదికను ప్రకటించిన నాటినుంచి తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. అసెంబ్లీలో సైతం జనాభా గణాంకాలతో సహా వివరించానని తెలిపారు. అసమగ్రంగా ఉన్న సర్వే నివేదికను పూర్తిగా ఉపసంహరించుకొని శాస్త్రీయంగా మళ్లీ మొదటినుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో వివరాలు నమోదు చేసుకోనివారు మాత్రమే తమ వివరాలను రీసర్వేలో చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా ద్వారా చెప్పడాన్ని తలసాని ఖండించారు.
కులగణన బోగస్ అని తేలిపోయింది: పెద్ది సుదర్శన్‌రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన బోగస్ అని తేలిపోయిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకుండానే రాష్ట్రంలో ఉత్సవాలు ఎందుకు నిర్వహించినట్టు అని నిలదీశారు. పరిపాలన అనుభవం లేక, స్వతహాగా ఆలోచించే పరిణితి లేక కులగణన చేపట్టి అత్యుత్సాహంతో కాంగ్రెస్ తప్పటడుగు వేసిందని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారనే భయంతో తామే చట్టం చేస్తామని, కేంద్రానికి పంపుతామని కాలయాపన చేస్తూ, ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పోరాటంతోనే రీ సర్వే : గోసుల శ్రీనివాస్‌యాదవ్
బీఆర్ఎస్ పార్టీ సాగించిన పోరాటంతోనే రాష్ట్ర ప్రభు త్వం దిగివచ్చి కులగణన రీసర్వే చేపడుతున్నదని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా శాస్త్రీయంగా బీసీ జనగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు.
స్వాగతిస్తున్నాం: కిశోర్‌గౌడ్
కులగణనలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం మరోసారి సర్వే చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా, వివిధ సందర్భాల్లో చేసిన ఒత్తిడి వల్లనే ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని సరిచేసుకొని, నిష్పక్షపాతంగా మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి జనాభా ఎంత శాతమో కచ్చితంగా ప్రకటించాలని కోరారు.