హైదరాబాద్: గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదన్నారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోతే తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా సోమార్‌పేట్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి, వైద్య ఖర్చులు పార్టీనే భరిస్తుందని.. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు ఇష్టమొచ్చినట్టు దాడులకు తెగబడుతుంటే.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందన్నారు. ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న అత్యంత దారుణంగా ఉందన్నారు. డీజీపీ స్థాయి నుంచి కిందిస్థాయి పోలీస్ అధికారుల వరకు అందరికీ గుర్తు చేస్తున్నా.. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే. రేవంత్ ఇంట్లో సొమ్ముతోనే, కాంగ్రెస్ సొమ్ముతోనే కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదని హెచ్చరించారు. భారతి, బాలరాజులపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేయాలన్నారు. ఆస్పత్రి పాలైన వారి కుటుంబాని ఆర్థిక సహాయం, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రెండేండ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తకలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సూర్యాపేట, నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడి చేసి మూత్రం తాగించారన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాదవ్‌ను కాంగ్రెస్ గూండాలు హత్య చేశారు, ఇంకో బీసీ సోదరుడి భార్య నామినేషన్ వేస్తే, అతడిని కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి అనుచరులు చిత్ర హింసలు పెట్టారన్నారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నామని, పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే తామే డ్యూటీ చేస్తామన్నారు. దాడికి ప్రతిదాడి అనే పరిస్థితే వస్తే తాము కూడా తిరగబడతామన్నారు. కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భారతి, బాలరాజ్ కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను పార్టీనే భరిస్తుందని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని.. దాడికి తెగబడ్డ కాంగ్రెస్ గూండాలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. సీఎం తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని, జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్ర గాయాల పాలై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం, సోమార్పేట్ గ్రామానికి చెందిన (బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన) బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతి గార్లను ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్… pic.twitter.com/sUJaxlThaa
— BRS Party (@BRSparty) December 16, 2025