KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. భూపాలపల్లిలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలని బరాబర్ అడుగుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ వెంటపడుతూనే ఉంటామని తెలిపారు.
అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో గెలిస్తే కల్యాణలక్ష్మీ డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తానని అబద్ధాలు చెప్పిండని అన్నారు. కానీ ఇప్పుడు మొఖం బాగోలేక అద్దం పగులగొట్టినట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లోనే రైతుబంధు పడేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాను రద్దు చేయను అంటున్నాడు
నువ్వు పెట్టినవారా తీసేయడానికి?
రెండేళ్లలో ఈ పొట్టోడు ఏం పీకిండు?
జిల్లాను రద్దు చేస్తే ప్రజలు నీ వీపు చింతపండు చేస్తారు – కేటీఆర్ pic.twitter.com/8HVs9UXoYx
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2026
భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని రేవంత్ రెడ్డి అంటున్నాడని కేటీఆర్ తెలిపారు. నువ్వు పెట్టినవా తీసేయడానికి.. రెండేళ్లలో ఈ పొట్టోడు ఏం పీకిండని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే నీ వీపు చింతపండు చేస్తారని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాను తెచ్చింది అభివృద్ధి చేసింది కేసీఆర్ అని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టులను రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి కట్టబెట్టిండని పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం బయటపెట్టామని ఫేక్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిప్పు పెట్టి తగులబెట్టారని మండిపడ్డారు. తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని గల్లా పట్టుకుని అడగండని ఓటర్లకు పిలుపునిచ్చారు. తులం బంగారం ఎప్పుడిస్తావని అడగాలన్నారు. రేవంత్ రెడ్డికి ఓటుతోనే కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. బూతుల ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్‌లోనే బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.