మంచిర్యాల, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షురాలిని తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులే గాంధీ భవన్ ముందు ధర్నా చేసి.. ‘నాన్ లోకల్ డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో’.. అని బహిరంగంగానే పేర్కొనడం విమర్శలకు తావిస్తున్నది. ఇక ఇందుకు డీసీసీ అధ్యక్షురాలు సైతం తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. ‘నేను ఈ జిల్లా బిడ్డనే.. నన్నెవరూ ఇక్కడి నుంచి తరిమి కొట్టలేరు’ అంటూ కుండబద్ధలు కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. అసలు డీసీసీ హటావో వెనుక కథేమిటి.. డీసీసీని మారిస్తే ఆ పార్టీలోని మిగిలిన ముగ్గురు కీలక నాయకులకు ఒరిగేదేమిటి.. అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణను ప్రకటించడానికి ఆ పార్టీకి చెందిన మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గవర్గ ఇన్చార్జి ముగ్గురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. కానీ పార్టీ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. అప్పటి నుంచి డీసీసీని గద్దె దించడమే లక్ష్యంగా.. ఆ ముగ్గురు పావులు కదుపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త డీసీసీ వచ్చాక పాత డీసీసీ మాట ఎవరూ వినిపించుకోవడం లేదని, సొంత పార్టీ నాయకులతో పాటు అధికారులు సైతం పాత డీసీసీని పట్టించుకోవడం లేదని సమాచారం. పార్టీ అధిష్ఠానం సైతం ఆయనను లైట్‌గా తీసుకోవడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు తెలిసింది. తాజాగా.. మండల అధ్యక్షుల నియామకాల్లో ఆయన వర్గానికి ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఈ పంచాయితీ గాంధీభవన్‌దాకా వెళ్లిందని చెబుతున్నారు.
ఇక మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం డీసీసీ అధ్యక్షురాలిని కొనసాగనిస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమిటన్న డైలమాలో ఉన్నారు. అదే డీసీసీ లేకపోతే ఇద్దరిలో ఒకరం ఎమ్మెల్యే, మరొకరం ఎంపీగా పోటీ చేయొచ్చని.. అదే ఆమె ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. మనకు చెక్ పెడుతారని, ఒకవేళ ఆ ఎన్నికల్లో ఫలితం తారుమారైతే ఎంపీ టికెట్ సైతం ఇచ్చే అవకాశాలున్నాయన్న భావనలో ఉన్న ఇద్దరు నేతలు.. మాజీ డీసీసీతో కలిసి సొంత పార్టీ డీసీసీ ప్రెసిడెంట్‌పై కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న గాంధీ భవన్లో నిర్వహించిన నిరసనలో ఈ ముగ్గురు నాయకుల వర్గాలు ఒక్కటై పాల్గొన్నాయని డీసీసీ వర్గీయులు చెబుతున్నారు. తిరుగుబాటు వెనుక ఎవరి స్వార్థం వారికి ఉందని.. మధ్యలో బలైపోయేది సాదాసీదా కార్యకర్తలేనన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ అధ్యక్షురాలిపై పార్టీ ముఖ్యనేతల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతలు పార్టీలో గందరగోళ పరిస్థితులకు కారణమయ్యాయి. ఒక్క నియోజకవర్గంలో నలుగురు కీలక నేతలు ఉండడంతో ఎవరితో కలిసి పనిచేయాలన్న క్లారిటీ లేకుండా పోయింది. దీంతో క్షేత్రస్థాయి కేడర్ గందరగోళంలో పడింది. కీలక నాయకుల మధ్య ఆదిపత్యపోరు స్థానిక నాయకులతో పాటు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. దీంతో పార్టీ ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు నాయకులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి వ్యవహారాన్ని చక్కదిద్దాలని చూస్తున్నట్లు తెలిసింది. స్థానిక నేతలతో చర్చల అనంతరం ఆ కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వనున్నది. నలుగురి వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఈ విషయంలో టీపీసీసీ సైతం క్లారిటీ ఇవ్వాలని, నివేదిక ఆధారంగా పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. మొత్తానికి డీసీసీ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుంది, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి స్థానికంగా పెరిగింది.