BRS | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ విలీనమంటూ నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. ‘24 ఏండ్లుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదురొన్న పార్టీ.. నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ.. బీఆర్ఎస్’ అని ఆయన బుధవారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. సాధించుకున్న తెలంగాణను సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామని తెలిపారు.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, వారి పక్షాన పోరాడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలని మానుకోవాలని మీడియా సంస్థలకు, వ్యక్తులకు కేటీఆర్ సూచించారు. పడతం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతామని, ఎప్పటికీ తలవంచబోమని స్పష్టంచేశారు.