ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుతారట. సోనియా బర్త్‌డే అధికారికంగా జరపడం కోసం తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకున్నారు. నిన్న బలిదేవత అన్నారు. నేడు బర్త్‌డే జరుపుత అంటున్నారు. అందుకోసమే విగ్రహం మార్పు పేరుతో తతంగం. అవతరణ దినోత్సవం పేరిట డ్రామా! – కేటీఆర్
KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి తప్ప తల్లుల విగ్రహాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. మార్పు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాజసం ఉట్టిపడే తెలంగాణతల్లి రూపాన్ని మార్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసేలా అతిపెద్ద అపచారం చేసిందని, పరిహారంగా యావత్ తెలంగాణతల్లికి మంగళవారం నుంచి పాలతో అభిషేకాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన కాంగ్రెస్తల్లి విగ్రహంతో అస్తిత్వంపై జరిగిన దాడికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబసభ్యులందరికీ, ఉద్యమ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణతల్లిని మళ్లీ ఆవిష్కరించేలా, సోషల్‌మీడియా వేదికలపై డీపీలుగా పెట్టుకోవాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణతల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేయాలని కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణతల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలు ఎప్పుడూ జరిగినా… ఘంటాపథంగా 100 సీట్లతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే సచివాలయం ముందు ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీభవన్‌కు తరలించడం ఖాయం. అదేవిధంగా భస్మాసుర హస్తం చూపుతున్న కాంగ్రెస్తల్లిని తెలంగాణతల్లిగా కీర్తీస్తున్నారో.. ఆ విగ్రహాన్ని కూడా గాంధీభవన్‌కు పంపిస్తాం’ అని పేర్కొన్నారు. ‘చరిత్ర తెలియని మూర్ఖులు మాత్రమే తెలంగాణ చరిత్రను మార్చాలనుకుంటారు. అప్రమత్తంగా ఉండకపోతే, సింహాలు తమ చరిత్రను చెప్పుకోకపోతే, వేటగాళ్లు చెప్పే పిట్టకథలే చరిత్రకు ఆనవాళ్లుగా మారిపోతాయి. సన్నాసులు చెప్పే అబద్ధాలను నిలువరించేలా, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది’ అని కేటీఆర్ వివరించారు.
నిరాహార దీక్షతో దేశాన్ని కదలించి..
దేశ రాజకీయాలను ఒక్క నిరాహార దీక్షతో కదిలించి, కేసీఆర్ అకుంఠిత సంకల్పం, అమరుల ఆత్మబలిదానాలకు చిహ్నాంగా ప్రతి ఏటా దీక్షా దివస్ జరుపుకొంటున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర సాధన సాధ్యమైందనే అంశాన్ని ఎవరూ చెరిపివేయాలేరని పేర్కొన్నారు. రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినా రేవంత్‌రెడ్డి… ఎప్పటికీ తెలంగాణ ద్రోహిగానే నిలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చి, ఆస్తిత్వానికి ప్రతిరూపమైన కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేసేలా దాడు లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
స్ఫూర్తిని రగిలించే తెలంగాణతల్లి రూపం
కాంగ్రెస్తల్లి చిత్రాలను చూసి సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయని కేటీఆర్ వివరించారు. సెక్రటేరియట్లో లంకెబిందెలు లేవని తెలుసుకుని, తెలంగాణతల్లి నెత్తి మీద ఉండే బంగారు కిరీటాన్ని, అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగలు ఎత్తుకుపోయారని జోకులు వేస్తున్నారని చెప్పారు. ‘పాల సంద్రంలో ఉద్భవించిన లక్ష్మీదేవి తరహాలో.. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో జనించిన తెలంగాణతల్లి పుట్టింది. తెలంగాణ ఉద్యమ ఉద్వేగానికి ప్రతీకగా తెలంగాణతల్లి నిలుస్తుంది. ఆమె రూపం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉద్యమస్ఫూర్తి రగులుతుంది. సాంస్కృతిక వైభవం కండ్లముందు కదలాడుతుంది. యావత్ తెలంగాణ జాతి సమిష్టి ఉద్యమం సాంస్కృతిక పోరాటం గుర్తుకు వస్తుంది. . భాషను వెక్కిరించి, తెలంగాణ నటీనటులను జోకర్లుగా చిత్రీకరించి, ఆటపాటలను ఈసడించుకుని, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, బోనాలను వెక్కిరించిన వారి కండ్లు మూతపడేలా ఉద్యమించిన తెలంగాణతల్లి గుర్తుకు వస్తుంది’ అని వివరించారు.
‘పుట్టినగడ్డను మాతృమూర్తిగా చూసుకుంటూ కొలుచుకుంటాం. భరతమాతను మొక్కుకుంటాం. భరతమాత విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. గాంధీ అనుకున్నట్టుగా స్వాతంత్య్రం తర్వాత భరతమాత విగ్రహాన్ని బంగారు కిరీటంతో వారణాసిలో ఏర్పాటుచేశారు. ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత హరిద్వార్‌లో భరతమాతను ఊరేగింపుతో ఏర్పాటుచేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అదే స్ఫూర్తితో తెలుగుతల్లిని బంగారు కిరీటం, నిండైన ఆభరణాలు, చేతిలో కలశంతో ఏర్పాటుచేశారు. పక్కనే ఉండే తమిళనాడులోనూ తమిళ తాయిలా పేరు పెట్టుకుని వజ్ర వైఢూర్యాలతో ఏర్పాటు చేసుకున్నారు. పక్కన ఉండే కర్ణాటకలో కన్నడ అంబేగా పిలుచుకుంటూ దేవతామూర్తి రూపాన్నిచ్చారు’ అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ మాయం
తెలంగాణతల్లిని వైతాళికులు, ఉద్యమ, సాహితీ, కవులు, కళాకారులు అద్భుతంగా కీర్తించుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మహాకవి దాశరథి మాటలకు ‘నా తెలంగాణతల్లి కంజాత వల్లి’గా కీర్తించారు, ‘వెల లేని నందనోద్యానం రా నా తెలంగాణతల్లి’ అంటూ 70 ఏళ్ల కిందటే రావెళ్ల వెంకట్రామారావు గొప్పగా చెప్పుకున్నారని వివరించారు. ‘కళాకారుల ధూంధాంలు, బతుకమ్మ ఆటపాటలు తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటేలా ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, ఆస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రతిరూపమే 2006లో తెలంగాణతల్లిగా పురుడు పోసుకున్నది. ఎంతో ఉద్యమ స్ఫూర్తితో సమైక్యాంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ వేదికపై తెలంగాణతల్లి వచ్చింది. ఆనాటి ఉమ్మడి పాలకుల దౌర్జన్యాలను అడ్డుకుంటూ జోగులాంబ నుంచి మొదలుకుంటే యావత్ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఆటపాటలతో ఆడబిడ్డలు ఉద్యమానికి ఊపిరి పోశారు’ అంటూ నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కళా నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచే పట్టుచీరతో, కరీంనగర్ నుంచి వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులతో కోహినూర్ వజ్రం పొదిగిన బంగారు కిరీటం ధరించిన తెలంగాణతల్లి విగ్రహంలో రాజసం ఉట్టిపడేదని కేటీఆర్ వివరించారు. ఈరోజు హంతకులే సంతాపం చెప్పినట్టుగా, 1952-2014 వరకు తెలంగాణలో వేలాది మంది చావులకు కారణమై, తొలి దశ నుంచి మలి దశ వరకు ఉద్యమాన్ని తొక్కి పడేసిన ఉద్యమ ద్రోహులు ముందు వరుసలో నిలబడి తెలంగాణతల్లిని పేదరాలిగా చేశారని విమర్శించారు. దివాలా తీసిన రాష్ర్టానికి ప్రతీకగా తల్లి రూపాన్ని దివాలాకోరు నేతలు మార్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, సునీతా లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, మాలోత్ కవిత, తుల ఉమ, రాజశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, రసమయి బాలకిషన్, నందికంటి శ్రీధర్, ఎర్రొళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాలకు నేడు క్షీరాభిషేకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా మంగళవారం తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణతల్లి విగ్రహానికి క్షీరాభిషేకాలతోపాటు పంచామృత అభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణతల్లి పేరు చెప్పి.. కాంగ్రెస్తల్లి పేరుతో ప్రభుత్వం తీరని అపచారం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ మూర్ఖులు చేసిన ఈ అపచారానికి, చరిత్ర తెలియని కాంగ్రెస్ పార్టీని క్షమించాలని తెలంగాణతల్లిని వేడుకుందామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తమ వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణతల్లి చిత్రాన్ని ప్రొఫైల్‌పిక్‌గా పెట్టుకోవాలని కోరారు.
బతుకమ్మను మాయం చేయడం
తెలంగాణ ఆస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట. యావత్ జాతిని జాగృత పరిచిన తెలంగాణతల్లి ఒక పార్టీకో, వ్యక్తికో సంబంధించినది కాదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆస్తిత్వానికి చిహ్నాలైన బతుకమ్మను, బతుకమ్మ చీరలను, బతుకమ్మ ఆటపాటలను చెరిపి, రానున్న రోజుల్లో తెలంగాణను మాయం చేసే కుట్రలకు తెగబడుతున్నది.
-కేటీఆర్
ఆలిని మార్చిన దుర్మార్గులు ఉంటారు కానీ, తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఉద్యమ సమయంలో వేలకొద్ది తెలంగాణతల్లి విగ్రహాలను ఊరురా ఏర్పాటుచేశారు. ఎవరు అభ్యంతరం చెప్పారని తెలంగాణతల్లి రూపాన్ని మార్చారు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. తలరాతలు మారాలే తప్ప.. తల్లులను మార్చడం అతి పెద్ద తప్పు. ప్రభుత్వం మారితే తెలుగుతల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా?
-కేటీఆర్