హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బైజూస్ పవర్డ్ టాబ్లెట్లు, సాఫ్ట్వేర్ అండ్ కోచింగ్ మెటీరియల్‌ని సొంత నిధులతో పంపిణీ చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఇది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మెరుగైన శిక్షణ పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
తాను మూడేండ్ల క్రితం ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని, తన హృదయానికి ఎంతో దగ్గరైందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘నేను ఇప్పుడు 46 ఏండ్లు పూర్తి చేసుకున్నా. నాపై మీ అందరి ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞుడిని. నా పుట్టినరోజును అర్థవంతమైన రీతిలో జరుపుకోవడానికి మూడేండ్ల క్రితం గిఫ్ట్ ఏ స్మైల్ ప్రారంభించా. మొదటి సంవత్సరం నేను ఆరు అంబులెన్స్‌లు విరాళంగా ఇస్తే.. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి 120 అంబులెన్స్‌లు ఇచ్చారు. రెండో ఏడాది నేను దివ్యాంగుల కోసం 200కు పైగా కస్టమ్మేడ్ వాహనాలను ఇస్తే.. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఆ సంఖ్యను 1,100కు పెంచారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.