హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని సొసైటీ కార్యాలయంలో రేషన్ దుకాణాన్ని పరిశీలించిన నిర్మలా సీతారామన్ కలెక్టర్‌తో ప్రవర్తించిన తీరుపై సోషల్‌మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారిని మంత్రి ఇలా గదమాయించడం, రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫొటో ఏమైదంటూ నిలదీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వికృతంగా ప్రవర్తించిన తీరు నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వీధుల్లో వేసే ఇలాంటి రాజకీయ వీరంగాలు కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను నిరుత్సాహ పరుస్తాయి. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.