హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తడిగుడ్డతో గొంతుకోయడంలో సీఎం రేవంత్‌రెడ్డి దిట్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తడిగుడ్డతో గొంతుకోయడమంటే కొనుగోళ్లు లేక కల్లాల్లో తడుస్తున్న ధాన్యమే సాక్ష్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు సర్కారుకు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీసాలెందుకు రాలేదు అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చింది అంటే మేనమామ పోలిక’ అని చెప్పినట్టే సర్కార్ తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారని విమర్శించారు.
అందితే జుట్టు అందకపొతే కాళ్లు అన్న చందంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నదని విమర్శించారు. సుఖమొస్తే మొకం కడగతీరదన్నట్టుగా సీఎం, మంత్రులు 25 సార్లకు పైగా ఢిల్లీకి, 26 సార్లకు పైగా విదేశీ పర్యటనలు చేసొచ్చారని విమర్శించారు.
కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు.. అని కేటీఆర్ హితవు పలికారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా సరార్ ఏం చేస్తున్నట్టు? విద్యార్థుల అవస్థలు రేవంత్‌రెడ్డి కంటికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? 10 రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై వారు గోడుగోడునా ఏడుస్తుంటే కనీసం సమీక్ష అయినా నిర్వహించావా? విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని 11 నెలల్లో చేసిందేమిటి? అని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి, గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి, ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి.. అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తున్నది.. మార్పునకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతున్నది పాపం’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఈ మార్పు మాకొద్దు’ అనే నినాదం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్నదని కేటీఆర్ తెలిపారు. అన్నివర్గాల్లో మొదలైన అసహనం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గర పడిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పనికిమాలిన పాలనలో పల్లెప్రగతి లేదని, పట్టణ ప్రగతి పడకేసిందని తెలిపారు. సీఎంకు ముందుచూపు కొరవడిందని, ఫలితంగా మొన్నటిదాకా పల్లెప్రగతితో మురిసిన పల్లెలు ప్రస్తుతం మురికి కూపాలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన పట్టణాలు నేడు సమస్యలకు నిలయాలుగా మారాయని తెలిపారు. పల్లే కన్నీరు పెడుతుందో అని పాడుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు పల్లే..పట్టణం అన్న తేడా లేకుండా రాష్ట్రం అంతా విలవిల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.