హైదరాబాద్: స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నవివాళులర్పించారు. ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి అన్నారు. సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేసిన పోరాటశీలి అని చెప్పారు. ఆమెకు ఎక్స్ వేదికగా పుష్పాంజలి ఘటించారు.
ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి..
సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేసిన పోరాటశీలి
సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్బంగా ఘన నివాళి pic.twitter.com/CwbUENJGQc
— KTR (@KTRBRS) January 3, 2025
నిరంకుశ పాలనపై నిప్పురవ్వలమవుదాం..
కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపై, నిరంకుశ పాలనపై, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపై మన పోరాటం కొనసాగిద్దామని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు ఆయన నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా సందేశమిచ్చారు.
‘ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా’ అంటూ ప్రారంభించిన కేటీఆర్.. గత ఏడాదిపాటు చేసిన పోరాటాలను, నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే రానున్న రోజుల్లోనూ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా, ప్రతి ఒకరికీ శిరస్సువంచి సలాం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గెలుపు-ఓటములతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్రస్థాయి నాయకత్వంలో మాటలకందని స్ఫూర్తిని నింపిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల పక్షాన గులాబీ సైనికులు విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన తుగ్లక్ పాలనతో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తున్న గులాబీ శ్రేణులను ఆయన అభినందించారు. రైతన్నలు, నేతన్నలు, బడుగు బలహీనవర్గాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమరభేరి మోగించారని కొనియాడారు. నిరుద్యోగుల హకుల కోసం కాంగ్రెస్ సరారును నిలదీసి, ఆరు గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు.