హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): పండించిన పంట కొనే దిక్కులేక, పట్టించుకొనే నాథుడు లేక సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మద్దతు ధర అం దక దగాపడ్డ రైతులకు భరోసా ఇచ్చేందుకు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు పడుతున్న అష్టకష్టాలను ఎలుగెత్తి చాటాలని నిశ్చయించింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చిన నిబంధనలు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పెడుతున్న కొర్రీలతోపాటు వానలకు తడిసిపోయిన పత్తిని అమ్ముకొనే దారిలేక చిత్తవుతున్న పత్తి రైతు తరఫున సమరభేరీ మోగించింది. పంట కోసి ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మద్దతుగా ఉద్యమబాట పడుతున్నది. మంగళవారం నుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకా రం చుడుతున్నది. పత్తి మార్కెట్ యార్డులను సందర్శించి నేరుగా రైతులతో మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్ పత్తి మా ర్కెట్ యార్డులను సందర్శించనున్నారు. కేటీఆర్ మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తారు. కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సాధకబాధకాలు తెలుసుకుంటారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. మధ్యా హ్నం 2 గంటలకు నిర్మల్ జిల్లా భైంసా మా ర్కెట్ యార్డులోని పత్తి కొనుగోలు సెంటర్‌ను సందర్శించి, రైతులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం 9 గంటలకు వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారు. అక్కడ పత్తి కొనుగోళ్లను పరిశీలిస్తారు. నేరుగా రైతులతో మాట్లాడతారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మరికొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వారివారీ ప్రాంతాల్లోని మార్కెట్లను సందర్శించనున్నారు. జగదీశ్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు తన నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేటలోని పత్తి మార్కెట్‌ను సందర్శిస్తారు.