వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హనుమకొండ, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉద్యమకాలం నాటి దృశ్యాలు కనిపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన భీతావహ పాలన సన్నివేశాలను మరోసారి కాంగ్రెస్ సర్కారే కండ్లగట్టింది. స్వరాష్ట్ర పాలనలోనూ తన నిర్బంధ డీఎన్ఏను మార్చుకోబోమని ఆచరించి చూ పింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటనకు రేవంత్ సర్కార్ అడుగడుగునా ఆంక్షలు విధించింది. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి గులాబీ సైన్యాన్ని నిరోధించింది. పెం బర్తి నుంచి కన్నెపల్లి దాకా జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ సివిల్, ఇంటెలిజెన్స్, ఎస్బీ సహా అనేక పేర్లతో పిలిచే యూనిఫామ్ సర్వీసెస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంచనలేకుండా ప్రయోగించింది.
‘నిలువరించండి. నిరోధించండి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీ లు, మాజీ ఎంపీలు మినహా మానవ పురుగు వెళ్లడానికి వీళ్లేదు’ అని పోలీసులను ఆదేశించింది. ‘అసలే పోలీసులు.. ఆపై ఆదేశాలు’ అంటే ఏమిటో చూపిస్తామన్నట్టుగా ఎక్కడిక్కడ వాలిపోయారు. సర్కార్ నిర్బంధాలను దాటుకుని గులాబీ సేనలు వేలాదిగా కన్నెపల్లికి చేరుకున్నారు. ఉద్యమకాలంలో ప్రభుత్వ వ్యూహాలను ముందే పసిగట్టే అనుభవం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రస్తుత పోలీసులు చేసిన వ్యూహాలకు చిక్కకుండా కేటీఆర్ పర్యటనలో భాగస్వాములయ్యారు.
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ గా పోలీసులు మోహరించారు. వందలాది మంది పోలీసులతో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను మేడిగడ్డకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి బారికేడ్ల వద్ద పోలీసులు నానా యాగీ చేశారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తూ అడ్డంకులు సృష్టించారు.. అయినా జంకకుండా గులాబీ శ్రేణులు మేడిగడ్డ వైపు ఉత్సహంగా అడుగులు వేశారు.
ఓ వైపు వానలు లేక నాట్లు వేసే పరిస్థితి లేని రైతుల బాధలను, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద కాంగ్రెస్ వైఫల్యంతో వేలాది టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతున్న దుస్థితిని వివరించేందుకు కన్నెపల్లి పంపుహౌ స్ వద్దకు కేటీఆర్ బయలుదేరగా జనగామ జిల్లా పెంబర్తి, రఘునాథపల్లిలోని కోమళ్ల టోల్‌ప్లాజా, పరకాల చలివాగు బ్రిడ్జి, కాటారం, మహదేవపూర్, కన్నెపల్లి వరకు అడుగడుగునా పోలీసులు అడ్డుకొనే ప్రయ త్నం చేశారు.
వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పోలీసుల వలయాలను ఛేదించి.. ఇనుప కంచెలను సైతం వంచి వేసి కేటీఆర్ కాన్వాయ్ ముందుకు సాగేలా చేశారు. ముందుగా జనగామ జిల్లా పెంబర్తి వద్దకు రాగానే కేటీఆర్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరసన తెలిపారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. కాన్వాయ్‌ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామని, కేటీఆర్ ఒక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు.

మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, గంగు ల కమలాకర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సైతం పోలీసుల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించగా పోలీసులతో స్వల్ప తోపులాట జరిగింది. అన్ని వాహనాలను అనుమతించాల్సిందేనని, పోలీసులు ఎలాంటి నిర్బంధం పెట్టినా కన్నెపల్లికి వెళ్లి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ హెచ్చరికలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో పరిస్థితి చేయి దాటుతుందనే ఆందోళనతో పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని అనుమతించారు. అక్కడి నుంచి పది కిలో మీటర్లు రాకముందే పోలీసులు మళ్లీ అడ్డంకులు సృష్టించారు. రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ ప్లాజా వద్ద లారీలను అడ్డుగా పెట్టి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. పరకాల సమీపంలోని చలివాగు బ్రిడ్జి వద్ద, ఆ తర్వాత కా టారం, మహదేవపూర్ వద్ద అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరగా కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలోనూ కేటీఆర్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కేటీఆర్‌ను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించినా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు పొడవునా ఘన స్వాగతం పలికారు.
పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో తమ పర్యటనకు ఆటంకం కల్పిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి పరిధిలోని కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఓవైపు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కాన్వాయ్కి ఎవరూ అడ్డుపడకుండా పోలీసులను నెట్టివేశారు. తానే స్వయంగా రూట్‌ను క్లియర్ చేసి కేటీఆర్ కాన్వాయ్‌ని టోల్గేట్ దాటించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కేటీఆర్ కన్నెపల్లికి వెళ్లకుండా ఉండేందుకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచే నిర్బంధించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రతి పోలీసు స్టేషన్లోనూ బీఆర్ఎస్ శ్రేణులను నిర్బంధించారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగినా కేటీఆర్ కాన్వాయ్‌తో వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ఉన్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారి వెంట పలుచోట్ల భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు కన్పిస్తే వెంటనే ఠాణాకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు, కేటీఆర్ అభిమానులు భారీగా తరలివెళ్లారు.
వారిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్లు, సర్పంచ్‌లు, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు ఉన్నారు. జగిత్యాల నుంచి జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పడిగెల గంగారెడ్డి, బుర్ర ప్రవీణ్‌గౌడ్, లైశెట్టి శేఖర్, రంజిత్ తరలివెళ్తుండగా పోలీసులు అడ్డగించారు. చెన్నూరులో అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కాసేపటికి వదిలిపెట్టగా, పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఇంటి నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దివాకర్‌రావు ఒక్కరే వెళ్లాలని కండిషన్ పెట్టారు. చేసేదేమీ లేక దివాకర్‌రావు తన వాహనంలో ఇతర నాయకులను తీసుకొని కన్నెపల్లికి బయలుదేరి వెళ్లారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదే సత్యంను గృహ నిర్బంధం చేశారు. యూత్ విభాగం పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్, అంకుష్, కరుణాకర్‌ను అరెస్టు చేశారు. మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి వద్ద సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో గుమిగూడి వాహనాలు తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడమేగాక, పలువురిని ఇండ్లల్లోనే నిర్బంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండను బీఆర్ఎస్ శ్రేణనులు బద్దలు కొట్టి కేసీఆర్ నిర్మించిన కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, చేతనైతే మంచి పనులు చేసి ప్రజల ముందుకొచ్చి గెలువాలి. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నరు? ఎందుకు అంత భయం? రైతులు నాట్లు వేసే పరిస్థితి లేకున్నా కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి.. వాళ్ల ప్రభుత్వ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు మమ్మల్ని నిలువరిస్తున్నరు. మమ్మల్ని ఏం చేసినా వెనక్కి తగ్గం. కచ్చితంగా కన్నెపల్లి చేరుకుంటం. అక్కడ ప్రవహిస్తున్న లక్షల క్యూసెకుల నీళ్లను రైతులకు చూపెడుతం. తెలంగాణలో ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉన్నదో రైతాంగానికి వివరిస్తం. మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తం’ అని కేటీఆర్ నిప్పులు కురిపించారు.