అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడమేంది? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేకపోవడమేంది? నిన్న ప్రమాదం పెద్దగా జరుగలేదని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మొత్తం 2015 నుంచి పదేండ్లకు సంబంధించి అనేక కేసుల సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి చేయించిన పనే.
ల్యాబ్ దగ్ధమైన ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని నిజానిజాలు బయటకి తీయాలి. రేవంత్‌రెడ్డి అనే చోటే భాయ్‌ని బడే భాయ్ కాపాడటం లేదని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ-రేవంత్‌రెడ్డి మధ్య లాలూచీ లేకుంటే వెంటనే కేంద్రం ఉన్నత విచారణ సంస్థలతో ఈ ఘటనపై స్పష్టమైన విచారణ చేయించాలి. రిటైర్డ్ జడ్జిని నియమించి నిజాలను నిగ్గు తేల్చాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హనుమకొండ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాను ఒక్కడు బయటపడేందుకు వేలాది మంది కరుడుగట్టిన నేరగాళ్లకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కాలిపోయి ఇప్పుడు వారంతా స్వేచ్ఛగా బయటతిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చిందని, శిక్ష పడుతుందన్న
భయంతోనే హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ ఈ ప్రమాదం వెను క ఉన్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రని, ఓటుకు నోటు సాక్ష్యాధారాలను శాశ్వతంగా తొలగించేందుకే ప్రమాదమనే నాటకమాడారని కుండబద్దలు కొట్టారు.
నేరగాడే సీఎం అయినందున ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎఫ్ఎస్ఎల్ ప్ర మాదంలో రేవంత్ కేసుతోపాటు వేలాది మంది నేరస్తుల కేసుల తాలూకు సాక్ష్యాలు దగ్ధమయ్యాయని, హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు చేసిన వారు ఇప్పుడు సమాజంలో ఇష్టం వచ్చినట్టు తిరిగే అవకాశం లభిస్తుందని వాపోయారు. ల్యాబ్ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి తో విచారణ జరిపించాలని, శాస్త్రవేత్తలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు శాసనసభా పక్ష బృందానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సర్కార్‌కు మద్దతు ఇచ్చే.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులెవరైనా దీని వెనుక ఉన్నారా? అనే విషయాన్ని నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
నిన్న ఒకలా.. ఇవ్వాళ మరోలా
అత్యంత భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్నిప్రమాదం జరగడంపై కేటీఆర్ సందేహం వ్యక్తంచేశారు. 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేరని చెప్ప డం ఏమిటని ప్రశ్నించారు. శనివారం ప్రమా దం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఆదివారం 2015 నుంచి 10 ఏండ్లకు సంబంధించిన కేసుల సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది ముమ్మాటికీ రేవంత్ చేయించిన పనేనని తేల్చిచెప్పారు. ప్రమాదం జరిగిన భవనం మూడు అంతస్తులే ఉన్నదని, మంటలను ఆర్పడం పెద్ద కష్టమైన పనికాదని చెప్పారు. పొద్దున 10 గం టలకు మొదలైన మంటలను మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కూడా ఆర్పలేకపోయారని, మొ దటి అంతస్తులో మంటలు ఆర్పడానికి మూ డున్నర గంటల సమయం పట్టిందంటేనే కుట్ర ఉన్నట్టుగా స్పష్టమవుతున్నదని చెప్పారు. రేవంత్ లాంటి క్రిమినల్, దొంగ సీఎంగా ఉండటం వల్ల తెలంగాణ రెండేండ్లుగా అనేక దుర్మార్గాలను చూస్తున్నదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి కేసు ఆధారాలన్నింటినీ భద్రపరిచిన ఫోరెన్సిక్ లాబొరేటరీని కుట్రపూరితంగా ధ్వంసం చేసి దాన్ని అగ్ని ప్ర మాదంగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. 11 ఏండ్లుగా కొనసాగుతున్న ఓటుకు నోటు కేసు చివరి దశలో ఉన్నదని, రేవంత్‌రెడ్డి అందులోంచి బయటపడేందుకే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దగ్ధానికి కుట్ర పన్నారని విమర్శించారు.
ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే
ఢిల్లీ సర్కార్ నుంచి మద్దతిస్తున్న కొందరు పెద్దల ఆదేశాల మేరకే రేవంత్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగలబెట్టించాడని కేటీఆర్ అనుమా నం వ్యక్తంచేశారు. కుట్ర పూరితంగా దగ్ధం చేయడంతో 50 కంప్యూటర్లు, సర్వర్లు, కీలక ఫైళ్లు కాలిపోయాయని చెప్పారు. వేలాది నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు కాలిపోయి కరుడు గట్టిన నేరస్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంతో లాలూచీ పడి తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్న రేవంత్, ఓటుకు నోటు కేసులోనూ కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకునే రేవంత్, న్యాయస్థానంలో ఉన్న ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉన్నందున చావు తెలివితేటలతో సాక్ష్యాలను మాయం చేసే దారుణమైన కుట్రకు తెరలేపారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
రేవంత్ ప్రైవేట్ ఆర్మీగా పోలీసులు
రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని, అనేక మంది పోలీసులు రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీస్ యంత్రాంగానికి, డీజీపీకి దమ్ముంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కేసులో నిజానిజాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ సీఎం అన్నదమ్ములు, బావమరుదులు చేస్తున్న భూముల సెటిల్మెంట్లు, అరాచకాలు తెలంగాణలో అందరికీ తెలుసని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్‌రెడ్డి ఓ వ్యాపారవేత్త తలకు తుపాకీ పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేసినట్టు మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పినా పోలీసులు ఎలాంటి కేసూ నమోదు చేయలేదని చెప్పారు. ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్షాలు, సోషల్ మీడియా వారియర్స్‌ను కేసుల పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రం కల్పించుకోవాలి
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఘటనపై కేంద్రం కల్పించుకొని నిజానిజాలు బయటకి తీయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ అనే చోటే భాయ్‌ని బడే భాయ్ కాపాడటం లేదని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని, బీజేపీ-రేవంత్ మధ్య లాలూచీ లేకుంటే కేంద్రం రిటైర్డ్ జడ్జిని నియమించి నిజాలను నిగ్గు తేల్చాలని సవాల్ విసిరారు. బీజేపీ-రేవంత్ బడే భాయ్-చోటే భాయ్ అనుబంధం బలంగా ఉన్నదని, తెలంగాణలో రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్ నడస్తున్నదని స్వయంగా ప్రధాని ఆరోపణలు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. కేంద్ర హోం మంత్రి వచ్చి కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్పి ఏమీ చేయలేదని గుర్తుచేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఎస్ఎఫ్ఐవో, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ చెప్పినా కేంద్రం స్పందించలేదని తెలిపారు. సింగరేణి కుంభకోణం బయటపెట్టినా కేంద్రం కనీసం పట్టించుకోలేదని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు జరిగి ఏడాదిన్నర గడిచినా కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కేసులో బీజేపీ చిత్తశుద్ధి తేలిపోతుందని, బడే భాయ్, చోటే భాయ్ బంధంతోనే రేవంత్‌ను కాపాడుతున్నారని బలంగా నమ్ముతున్నామని, ఆ బంధం లేకుంటే రేవంత్ మీద రిటైర్డ్ జడ్జితో వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సాక్ష్యాధారాలు,రికార్డులు, కంప్యూటర్లు, చివరికి సర్వర్లను కుట్రపూరితంగా దగ్ధం చేశారు. ఈ ఘటనలో వేలాది నేరాలు, నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాధారాలు కాలిపోయినయ్. ఆధారాలు బూడిదై కరుడు గట్టిన నేరస్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. రేవంత్ ఒక్కడు తప్పించుకునేందుకు వేలాది మంది నేరస్తుల ఆధారాలను కాలబెట్టించిండు.
– కేటీఆర్