KTR | రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొందరి గొంతులు లేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాళ్లను అడ్డుకోవడానికి మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియా అని తెలిపారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్‌లా విజృంభించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియా పేరుతో కొన్ని స్లాటర్ హౌస్‌లు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. మీ ముందున్న అన్యాయాన్ని సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు.
తెలంగాణలో కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్టులే చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్, చంద్రబాబు, మోదీ కలిసి బీఆర్ఎస్పై కుట్రలు పన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉంటే వాళ్ల ఆటలు సాగవని కుట్రలు చేస్తున్నారని అన్నారు. గోదావరి నికర జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు రావాలని చెప్పారు. గోదావరి వరద జలాల్లో మన వాటా మనకు రావాలని అన్నారు. బనకచర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ చేస్తున్న పోరాటం అభినందనీయమని ప్రశంసించారు. మోదీ జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్లు ఆడతాడని చంద్రబాబు నమ్మకమని అన్నారు.
ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని రేవంత్ రెడ్డి చెప్పాడని కేటీఆర్ గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్‌కు డైవర్షన్‌కు పనికొస్తుందని తెలిపారు. 20 నెలలైనా గ్యారంటీలు, హామీలపై కాంగ్రెస్ నోరెత్తడం లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేస్తే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని తెలిపారు. 25 లక్షల కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని నమ్మబలికారని అన్నారు. చివరకు అన్ని హామీలు ఎగ్గొట్టి మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఒక్కో ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి 50 వేలు బాకీ ఉన్నాడని చెప్పారు. 7 లక్షల ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ పడ్డారని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చారని మండిపడ్డారు. అన్నీ తెలిసే అధికారం కోసం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.